పేరెంట్స్ తస్మాత్ జాగ్రత్త: గంటకో విద్యార్థి ఆత్మహత్య
ప్రతి గంటకో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడుతున్నాడంటే పరిస్థితి ఎంత విపత్కరంగా మారిందో అవగతమవుతూనే ఉంది.
న్యూఢిల్లీ: పరీక్షల్లో ఫెయిల్.. ఎంచుకున్న కెరీర్ దిశగా వెళ్లలేని అశక్తత.. చెడు వ్యసనాలు.. టీనేజీ కుర్రాళ్లు.. విద్యార్థులను వేధిస్తున్నాయి. దీనికి తోడు తల్లిదండ్రుల ఆకాంక్షలను బలవంతంగా రుద్దుతున్న నేపథ్యం చిన్నారులు తమ ఉసురు తీసుకునేందుకు వెనుకాడని పరిస్థితి నెలకొన్నది. 2012 నుంచి 2017 వరకు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ పరిస్థితి నెలకొన్నది. ప్రతి గంటకో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడుతున్నాడంటే పరిస్థితి ఎంత విపత్కరంగా మారిందో అవగతమవుతూనే ఉంది.
వారం క్రితం దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై నగరంలోని ఓ స్టార్ హోటల్ 19వ అంతస్థు నుంచి అర్జున్ భరద్వాజ్ (24) అనే ఎంబీఏ విద్యార్థి దూకి చనిపోయాడు. మరో ఏడాదిలో చదువు పూర్తయితే ఏదో చోట ఒక ఉద్యోగం లభిస్తుందని, జీవితంలో స్థిరపడుతాడనుకున్న తల్లిదండ్రులకు ఈ ఘటన ఊహించని షాక్. ఇంతకీ అతడి బలవన్మరణానికి కారణం ఒత్తిడి. ఇటీవలి పరీక్షల్లో ఫెయిల్ అయిన అర్జున్ భరద్వాజ్ తోటివారితో పోటీపడలేకపోతున్నానని ఆందోళనతో కన్నవారికి కడుపుకోత మిగుల్చుతూ తనువు చాలించాడు. ఈ విషాదం ఒక అర్జున్‌తోనే ఆగిపోలేదు.

ప్రతి గంటకు ఇలాంటి మృత్యుఘంటికలు మోగుతూనే ఉన్నాయి. జాతీయ నేర రికార్డుల విభాగం గణాంకాల ప్రకారం 2015లో దేశవ్యాప్తంగా 8,934మంది చనిపోయారు. అంటే సగటున ప్రతి గంటకు ఒక విద్యార్థి అకారణ ఆందోళనలు, ఒత్తిళ్లకు గురై చనిపోతున్నారు. ఇలా అత్యధికంగా బలవన్మరణాలకు పాల్పడే వారి వయస్సు 15 - 29 ఏళ్ల మధ్య ఉండటం ఆందోళన కలిగించే విషయమే మరి.
అత్యధిక మరణాలు జరుగుతున్న రాష్ట్రాలు మహారాష్ట్ర తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, సిక్కిం కావడం గమనార్హం. మహారాష్ట్రలో 2015లో 1230 మంది, తమిళనాడులో 955, ఛత్తీస్‌గఢ్‌లో 625 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉండే తమిళనాడులో కూడా అత్యధిక ఆత్మహత్యలు చోటు చేసుకోవడం ఆర్థిక ప్రగతి సృష్టిస్తున్న ఒత్తిళ్లేనన్న విమర్శలు ఉన్నాయి. కనుక తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్.. వారి కెరీర్ గురించి ఆందోళన చెందకుండా.. జాగ్రత్తగా గైడ్ చేస్తూ ముందుకు సాగాలే తప్ప ఒత్తిడి తేవడం శ్రేయస్కరం కాదని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు.
మానసిక వైద్యులను ఆశ్రయించే అలవాటు తక్కువే
మనదేశంలో మానసిక సమస్యలపై వైద్యులను ఆశ్రయించడం చాలా తక్కువ. విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నా, చాలామంది తల్లిదండ్రులు దీనిని ఓ సమస్యగా కూడా పరిగణించకపోవడం విషాదం. మానసిక వైద్య సేవలు మన పొరుగు దేశం - దాయాది బంగ్లాదేశ్‌తో పోల్చినా భారత్‌లోనే కనిష్ఠంగా ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థుల ఆత్మహత్యలకు వారి కుటుంబ ఆర్థిక స్థితిగతులూ ఓ కారణమేనని వెల్లడైంది. 2015లో చనిపోయిన విద్యార్థుల్లో లక్షలోపు ఆదాయం గల కుటుంబాలకు చెందిన వారు 70% ఉండటం గమనార్హం. 2015లోనే 8,934 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడితే.. 2011 - 15 మధ్య ఐదేళ్లలో 39,775 మంది బాలలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక ఆత్మహత్యాయత్నాలు మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఈ గణాంకాలే చెప్తున్నాయి.
సమస్యగా మానసిక వైద్యుల కొరత
ఇక దేశంలో మానసిక వైద్యుల సంఖ్య కూడా తక్కువే. మానసిక ఒత్తిడికి గురవుతున్న వారితో మానసిక వైద్యులు, సైకాలజిస్టులు జరిపిన సంప్రదింపుల్లో పలు అంశాలు బయటపడ్డాయి. పరీక్షల్లో ఫెయిలైతే కుటుంబాల నుంచి గానీ, ఇతర సామాజిక సంస్థల నుంచి గానీ తమ కెరీర్ విషయంలో మద్దతు లభించదన్న ఆందోళన వారిలో పెరిగిపోతున్నది. ప్రస్తుతం భారతదేశంలో విద్యార్థుల మానసిక రుగ్మతల నివారణకు 87 శాతం మంది సైకాలజిస్టుల కొరత తీవ్ర సమస్యగా మారిందిన ఇండియా స్పెండ్ ప్రతినిధి సల్దానా తెలిపారు. దేశంలో సైకియాట్రిస్టులు 3800 ఉండగా, క్లినికల్ సైకాలజిస్టులు 898 మాత్రమే ఉన్నారు.
టాప్ 3లో సిక్కిం.. ఆత్మహత్యల్లోనూ ముందు వరుస
అత్యధిక వ్యక్తిగత ఆదాయం సంపాదనలో ఢిల్లీ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రం తర్వాత చోటు దక్కించుకున్న సిక్కిం అక్షరాస్యతలో భారతదేశంలో ఏడో స్థానంలో నిలిచింది. అదే క్రమంలో నిరుద్యోగంలో మాత్రం రెండో అతిపెద్ద రాష్ట్రంగా నిలిచింది. గత మార్చి 18 నాటికి సిక్కింలో ఉపాధి లేక 21 - 30 ఏళ్లలోపు విద్యార్థులు 27 శాతం మంది మరణించారని సర్వే నివేదికలు చెప్తున్నాయి.
సంతోషమే పూర్తిబలం
మెంటల్ ప్రెషర్ ప్లస్ అనవసర ఆందోళన
మానసిక ఒత్తిడి, అకారణ ఆందోళనలు ఆనందమయ కుటుంబాలకు దూరంగా ఉంటాయని ఎన్‌ఫోల్డ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ సహ వ్యవస్థాపకురాలు షైబ్యా సల్దాన్హ పేర్కొన్నారు. 2016లో భారతీయ యూనివర్సిటీలు చేపట్టిన సర్వేలో ఈ విషయం స్పష్టంగా తేలిందన్నారు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లకు దేశంలోనే పేరెన్నికగన్న రాజస్థాన్‌లోని కోటా విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నదని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు.












Click it and Unblock the Notifications