జైలులో పుస్తక పఠనంలోనే 'సత్యం' రాజు
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో దోషిగా తేలిన రామలింగ రాజు హైదరాబాదులోని చర్లపల్లి జైలులో పుస్తక పఠనంతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఆయన రోజుకు 10 నుంచి 15 గంటల పాటు రీడింగ్ రూంలో ఉంటూ పుస్తకాలు చదవడానికే ఇష్టపడుతున్నట్లు సమాచారం.
ఆయన ఎక్కువగా జీవ, రసాయన శాస్త్రం పుస్తకాలు, సైన్స్ పుస్తకాలు చదువుతున్నట్లు తెలుస్తోంది. పుస్తకాలతో గడుపుతున్న ఆయన జైలులో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడం లేదని అంటున్నారు. ఒంటరిగా ఉండేందుకే ఆయన ఇష్టపడుతున్నారట.

జైలులో ఆయనకు ప్రత్యేక సౌకర్యాలేమీ కల్పించలేదు. అందిరికి మాదిరిగానే అల్పాహారం, భోజనం ఆయనకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆయనకు ఇతర ఖైదీలకు అప్పగించినట్లు ప్రత్యేకమైన పనేది అప్పగించలేదు.
సోమవారంనుంచి రామలింగ రాజుకు, ఇతర సత్యం కేసు దోషులకు పని కల్పించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. రామలింగ రాజుకు జైలులో పాఠశాల, గ్రంథాలయం, కంప్యూటర్ తరగతుల నిర్వహణ వంటి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. రామలింగ రాజు మాత్రం లైబ్రరీ బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నట్లు సమాచారం.
రామలింగ రాజు నిందితుడిగా ఇప్పటికే మూడేళ్లు జైలులో ఉన్నారు. ఆ కాలాన్ని మినహాయిస్తే ఆయన మరో నాలుగేళ్లు జైలులో ఉండాల్సి వస్తుంది.












Click it and Unblock the Notifications