మహిళలకు ఢిల్లీ ప్రమాదకరం: తెలంగాణ సెకండ్, ఆరో స్థానంలో ఏపీ
న్యూఢిల్లీ: భారత దేశంలో ఉద్యోగం చేసే మహిళలకు అత్యంత భద్రమైన రాష్ట్రంగా తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఈశాన్య రాష్ట్రమైన సిక్కిం మొదటి స్థానంలో ఉంది. అదే సమయంలో చివరి స్థానంలో దేశ రాజధాని ఢిల్లీ ఉంది.
దేశంలో ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు ఏఏ నగరాలు అత్యంత భద్రతను అందిస్తున్నాయన్న విషయంమై అమెరికా సంస్థ సీఎస్ఐఎస్ (సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్) నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
మహిళలకు పని గంటలు, మహిళల పట్ల జరుగుతున్న నేరాలు, లైంగిక వేధింపులు, మొత్తం ఉద్యోగుల్లో మహిళల శాతం, వారికి లభించే ప్రోత్సాహకాలు, మహిళా ఔత్సాహికులు నడుపుతున్న కంపెనీలు తదితరాల ప్రాతిపదికన పాయింట్లు ఇచ్చారు.

ఇందులో సిక్కిం 40 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచింది. ఢిల్లీకి కేవలం 8.5 పాయింట్లు వచ్చాయి. సిక్కిం తర్వాత రెండో స్థానంలో మహిళా ఉద్యోగులకు తెలంగాణ అత్యుత్తమమని ఈ అధ్యయనంలో తేలింది. తెలంగాణకు 28.5 పాయింట్లు వచ్చాయి.
ఆ తర్వాత స్థానాల్లో పుదుచ్చేరి (25.6 పాయింట్లు), కర్ణాటక (24.7 పాయింట్లు), హిమాచల్ ప్రదేశ్ (24.2 పాయింట్లు), ఆంధ్రప్రదేశ్ (24 పాయింట్లు), కేరళ (22.2 పాయింట్లు), మహారాష్ట్ర (21.4 పాయింట్లు), తమిళనాడు (21.1 పాయింట్లు, చత్తీస్ గఢ్ (21.1 పాయింట్లు) నిలిచాయి.
భారత దేశంలో సిక్కిం, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు రాత్రివేళల్లో కూడా మహిళలను పని చేసేందుకు అనుమతించాయని ఈ సర్వే తెలిపింది. ఇక్కడి ఫ్యాక్టరీలు, రిటైల్ కేంద్రాలు, ఐటీ కంపెనీల్లో రాత్రి వేళల్లోనూ మహిళలు విధులు నిర్వహిస్తూ, భద్రంగా ఇళ్లకు చేరుతున్నారని తెలిపింది.












Click it and Unblock the Notifications