ఆ పాదాలను చూస్తే దు:ఖం రావాల్సిందే: తిండి, నిద్ర లేకపోయినా మహా'యాత్ర'..

Subscribe to Oneindia Telugu

ముంబై: ఆ బక్క రైతులది అలుపెరగని నడక. ఆకలికి పేగులు మాడుతున్నా.. నడినెత్తిన ఎండ భగ్గుమంటున్నా.. అవేవి వారి పోరాటానికి అడ్డు రాలేదు. చర్మం ఊడిపోయేలా పాదాలు బొబ్బలెక్కినా.. అడుగులు ముందుకే పడ్డాయి తప్ప ఎక్కడా వారి సంకల్పడం సడలలేదు.

ఇంతటి మహత్తర పోరాటంలో ఆ రైతులు పడ్డ బాధలు అన్నీ ఇన్నీ కావు. వాటన్నింటిని కళ్లకు కట్టే ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒక్కో ఫోటోను చూస్తుంటే.. ఎవరికైనా దు:ఖం రాకమానదంటే అతిశయోక్తి లేదు.

రైతుల మహాయాత్ర..:

రైతుల మహాయాత్ర..:

నాసిక్‌ నుంచి ముంబై వరకు రోజుకు 30కి.మీ చొప్పున మొత్తం 180 కిలో మీటర్ల పాదయాత్ర. 35-40డిగ్రీల ఎండలో.. తినడానికి తిండి, నిద్ర, కాళ్లకు చెప్పులు కూడా లేని స్థితిలో ఆ రైతులు చేసిన పాదయాత్ర దేశం మొత్తాన్ని కదిలించింది. వయసు పైబడ్డా.. ఒంట్లో ఓపిక లేకపోయినా.. రేపటి అన్నదాత భవిష్యత్తు కోసం ఎంతోమంది వృద్ద రైతులు కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.

వట్టి కాళ్లతోనే నడిచారు..:

వట్టి కాళ్లతోనే నడిచారు..:

పాదాలు బొబ్బలెక్కి.. చర్మం ఊడిపోతున్నా సరే.. బాధనంతా పంటిబిగువనే భరించి ముందుకు కదిలారు తప్పితే ఎక్కడా పాదయాత్ర నుంచి పక్కకు తప్పుకోలేదు. గూడలు తెగిన చెప్పులతో కొందరు, వట్టి కాళ్లతోనే మరికొందరు.. ఎండకు పాదాలు మాడిపోతున్నా సరే వారి పోరాటం ఎక్కడా విశ్రమించలేదు.

 అదో జన ప్రవాహం:

అదో జన ప్రవాహం:

నాసిక్ నుంచి యాత్ర మొదలైన రోజు 30వేల మందితో మొదలుకాగా.. ఒక్కో ఊరు దాటుతుంటే జనం ప్రవాహంలా వచ్చి పాదయాత్రలో అడుగు కలిపారు. మరాఠ్వాడా, రాయగఢ్, విదర్భ ఇలా ఒక్కో ప్రాంతం నుంచి దాదాపు 50వేల పైచిలుకు రైతులు ముంబై వరకు పాదయాత్రలో పాల్గొన్నారు.

తిండి, నిద్ర లేకపోయినా..:

తిండి, నిద్ర లేకపోయినా..:

రోజంతా ఎండలో పాదయాత్ర.. రాత్రి పూట ఎక్కడ జాగా దొరికితే అక్కడే నిద్ర.. కుదిరితే రోడ్డు పక్కనే వండుకుని తలా కాసింత తినడం.. లేదంటే ఖాళీ కడుపుతోనే మళ్లీ పాదయాత్ర.. కాలకృత్యాలు తీర్చుకునే కనీస సదుపాయాలు కూడా లేకపోయినా.. పాదయాత్రలో వారెక్కడా రాజీపడలేదు. దుమ్ము, ధూళిని లెక్క చేయక.. 140గంటల పాటు సుదీర్ఘ నడకను కొనసాగించారు.

 వారి ఆవేదన..:

వారి ఆవేదన..:

పాదయాత్రలోని రైతులను కదలిస్తే.. 'మా జీవితమే ప్రమాదంలో ఉంది ఈ నడక మాకేమి కష్టం కాదు' అని చెప్పడం గమనార్హం. పంట కోసం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాకపోతే? ఇక మాకు బతుకెక్కడిది అని వారు వాపోతున్నారు. సమస్యల పరిష్కారానికి మహారాష్ట్ర ప్రభుత్వం ముందుకురావడంతో రైతులు చేసిన ఈ మహా పాదయాత్ర విజయం సాధించినట్టయింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Around 40,000 farmers in and around Maharashtra marched to Mumbai for six consecutive days in hope that the state government finally takes notice of their plight.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి