గ్లామర్ రాజకీయాలు
ముళ్లును ముళ్లుతోనే తీయాలంటారు. దీన్ని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఆచరణలో పెట్టడానికి సిద్ధమయ్యారు. సినీ గ్లామర్ ను సినీ గ్లామరుతోనే ఎదుర్కోవడానికి ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రజారాజ్యం పార్టీ నాయకత్వమే సినీ గ్లామరుతో నిండిపోయింది. చిరంజీవికి తోడు పవన్ కళ్యాణ్, నాగబాబు ప్రజలను తమ వైపు ఆకర్షించడానికి సిద్ధం కాగా, తెలుగుదేశం పార్టీ నందమూరి హీరోలను రంగంలోకి దింపింది. బాలకృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న కూడా ప్రచారానికి సిద్ధమవుతున్నారు. నిజానికి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి సినీ కళాకారుల నుంచి ఎక్కువ మద్దతు ఉంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించడంతో సినీ రంగం మూడు చీలికలు అయింది.
కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి, కాంగ్రెసుకు మద్దతివ్వడానికి సినీ కళాకారులు ఒక్కరొక్కరే ముందుకు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సలహాదారు ధర్మవరం సుబ్రహ్మణ్యం కాంగ్రెసుకు సినీ గ్లామర్ అద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ, మోహన్ బాబు కాంగ్రెసుకు పూర్తి స్థాయిలో ప్రచారం చేయడానికి ముందుకు వచ్చినట్లే. రాజశేఖర్, జీవిత దంపతులతో మొదలైన ఈ తారా ప్రస్థానం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. జయసుధ కాంగ్రెసుకు పూర్తి మద్దతిస్తూ పార్టీలో చేరారు.
తాజాగా నాగార్జున ప్రభుత్వ వాణిజ్య ప్రకటనల్లో నటించడం పలువురిని ఆశ్చర్యపరిచింది. చిరంజీవి, నాగార్జున మంచి మిత్రులే కాకుండా వ్యాపార భాగస్వాములు కూడా. అటువంటి నాగార్జున కాంగ్రెసుకు అనుకూలంగా వ్యవహరించడం విచిత్రమే మరి. నంది అవార్డుల ప్రదానోత్సవంలో కాంగ్రెస్ రాజకీయం స్పష్టంగానే అర్థమైందని అంటున్నారు. కాంగ్రెసువారికే అవార్డులిప్పించుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నంది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కృష్ణ, మోహన్ బాబు రాజకీయ ప్రసంగాలే చేశారు. రాజశేఖర రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని వారు పిలుపునిచ్చారు. నాగార్జున, మహేష్ బాబు మాత్రం ముఖ్యమంత్రిని నిరాశ పరిచారు. మహేష్ బాబు కాంగ్రెసుకు మద్దతు ప్రకటిస్తూ మాట్లాడ్తారని భావించారు. కానీ ఆయన ఆ పని చేయలేదు. మహేష్ ను ప్రచారం కోసం సంసిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అతను ఎంత వరకు సిద్ధపడతాడో తెలియదు.
సినీ కళాకారులకు పార్టీ ప్రాధాన్యం ఇవ్వడంపై కాంగ్రెసులోని కొంత మంది నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినీ కళాకారులతో ఓట్లు రాలవని పార్లమెంటుసభ్యుడు వి. హనుమంతరావు వంటి వాళ్లు అంటున్నట్లు సమాచారం. ఏమైనా తెలుగు సినీ రంగం మాత్రం రాజకీయాలను రాచుకు తిరుగుతోంది.












Click it and Unblock the Notifications