వైయస్ జగన్ వల్లనే విభజన?

వైయస్ రాజశేఖర రెడ్డి ఎన్నికల్లో తన అనుచరులకే టికెట్లు వచ్చేలా చూసుకుని, వారిని గెలిపించుకున్నారు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సీనియర్లను కూడా పక్కన పెట్టి జూనియర్లకు మంత్రి పదవులు కట్టబెట్టారు. ప్రతిదానికీ అధిష్టానం ఆమోదం ఉన్నట్లు ఆయన చెబుకుంటూ వచ్చారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతితో పరిస్థితులు మారిపోయాయి. వైయస్ అనుయాయులు జగన్ నాయకత్వం కోసం పట్టబడుతూ కాంగ్రెసు అధిష్టానాన్నే ధిక్కరించే పరిస్థితి వచ్చింది. వైయస్ జగన్ అధిష్టానం విధేయత అనుమానంగా మారింది. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలంటూ ప్రాంతాలతో సంబంధం లేకుండా మంత్రులు, కాంగ్రెసు శాసనసభ్యులు పట్టుబడుతూ వచ్చారు. రోశయ్యను ముఖ్యమంత్రిని చేయడాన్ని ప్రశ్నించారు. ఈ రకంగా జగన్ సోనియాకే సవాల్ విసిరారు. ఈ సవాల్ ను స్వీకరించి, జగన్ ను పక్కన పెట్టడానికి చాలా కృషే చేయాల్సి వచ్చింది.
జగన్ సమస్యను పక్కదారి పట్టించి, తాము చేయదలుచుకున్న పనిని చేయడానికి మంచి సందర్భాన్ని కాంగ్రెసు అధిష్టానం ఎంచుకుంది. ప్రాంతాలతో ప్రమేయం లేకుండా జగన్ నాయకత్వాన్ని సమర్థిస్తూ వచ్చిన మంత్రులు, కాంగ్రెసు శాసనసభ్యులు ఇప్పుడు ప్రాంతాలవారీగా విడిపోయారు. ఇక జగన్ నాయకత్వం ప్రశ్న ఉత్పన్నమయ్యే పరిస్థితి లేదు. తాము ఇచ్చిన మాటను నిలబెట్టకుంటామని చాటడానికి తగిన సందర్భాన్ని సోనియా ఎంచుకున్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంతో పాటు రాష్ట్ర కాంగ్రెసు నాయకత్వం తనకు సవాల్ చేసే విధంగా పరిణమించకూడదనే ఉద్దేశంతో తీవ్రమైన చర్యకు దిగినట్లు భావించవచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుతో సోనియా శుక్రవారం దాదాపు 20 నిమిషాల పాటు ఫోన్ మాట్లాడినట్లు తెలుస్తోంది. సోనియాకు కెసిఆర్ విధేయంగా ఉండడానికి సిద్ధంగానే ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే విజయోత్సవ ర్యాలీలో కెసిఆర్ చిత్రాలతో పాటు సోనియా చిత్రాలను కూడా ఊరేగించారని భావించవచ్చు.
రాష్ట్రంలో సంక్షోభాన్ని కేంద్ర నాయకత్వం ఆహ్వానించిందనే చెప్పవచ్చు. రాజీనామాల నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి రాష్ట్ర విభజనకు చర్యలు చేపట్టే అవకాశాలున్నాయి. రాష్టంలో రోశయ్య నేతృత్వంలోనో, మరొకరి నేతృత్వంలోనో ప్రభుత్వం ఉండడం కన్నా రాష్ట్రపతి పాలన ఉంటేనే తమ పని సులువు అవుతుందని భావిస్తున్నట్లు సమాచారం. శాసనసభ్యుల, మంత్రుల రాజీనామాలను కాంగ్రెసు అధిష్టానం అహ్వానిస్తున్నట్లు సమాచారం వస్తోంది. ఇదంతా ఊహించే నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. పెద్ద రాష్ట్రం కావడం వల్లనే, ఎక్కువ మంది పార్లమెంటు సభ్యులు ఉండడం వల్లనే జగన్ తమను బెదిరించేందుకు సిద్ధపడ్డారని సోనియా భావించినట్లు సమాచారం. రెండు రాష్ట్రాలుగా విభజిస్తే జగన్ వంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలు మరొకరు పాల్పకుండా ఉంటారనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఇంత త్వరగా తెలంగాణ ఏర్పాటుకు ముందుకు దిగడానికి కారణమని అంటున్నారు.












Click it and Unblock the Notifications