చంద్రబాబు 'పిల్లివాటం'

Chandrababu Naidu
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యూహరచనలో దిట్ట అంటారు. ఆయన ఎత్తులకు ఎదుటి పక్షం చిత్తు కావాల్సిందేననే అభిప్రాయం కూడా ఉంది. కానీ, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ముందు ఆయన ఎత్తులు ఫలించలేదు. చంద్రబాబు కాబట్టే వైయస్ రాజశేఖర రెడ్డి ఎత్తులు పారాయనే అభిప్రాయం కూడా ఉంది. ఆయన చుట్టూ ఉన్న కోటరీ వల్ల ఆయన ఎప్పుడూ నష్టపోతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన ఎటూ తేల్చకుండా వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారనే అభిప్రాయం ఉంది. వ్యూహాత్మక మౌనం పేరిట ఆయన తన కాళ్ల కిందికి తానే నీళ్లు తెచ్చుకుంటున్నారా అని అనిపిస్తోంది. కీలక సందర్భాల్లో ఒక పార్టీ అధినేత తన వైఖరిని స్పష్టం చేయకపోవడం వ్యూహాత్మక మౌనం పనికి రాదు. చంద్రబాబు సమైక్యాంధ్ర వైపు ఉంటారా, తెంలగాణకు మద్దతు తెలుపుతారా అనే విషయాన్ని తేల్చడం లేదు. ఇలా తేల్చకపోవడం నాయకత్వ లక్షణం కిందికి రాదు. నాయకత్వ బలహీనత కూడా అవుతుంది. ఒక వైపు సీమాంధ్ర తెలుగుదేశం నాయకులు సమైక్య నినాదంతో ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం నాయకులు తమకు తెలంగాణ రాష్ట్రం కావాలని చెబుతున్నారు. అయితే తెలంగాణ నాయకులు మిగతా నాయకుల మాదిరిగా తెలంగాణ కోసం గట్టిగా నిలబడడం లేదనే అభిప్రాయం బలంగానే ఉంది. రెండు ప్రాంతాల నాయకులను ఒక తాటి మీద నిలబెట్టలేకపోవడాన్ని ప్రజలు నాయకత్వ బలహీనతగానే తీసుకుంటారు, వ్యూహాత్మక మౌనంగా తీసుకోరు.

తెలంగాణ ప్రజలు చంద్రబాబు సీమాంధ్రకు అనుకూలంగా ఉన్నారని భావిస్తే, సమైక్యాంధ్రప్రదేశ్ కు చంద్రబాబు అనుకూలంగా ముందుకు రావడం లేదనే అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఇది గోడ మీది పిల్లివాటంగానే పరిగణిస్తారు. ఇది రెండు ప్రాంతాల్లోనూ తెలుగుదేశం పార్టీకి నష్టమే కలగజేయవచ్చు. నిజానికి, చంద్రబాబు ఆలోచన మరో రకంగా ఉంది. రాష్ట్ర విభజన జరిగితే రెండు ప్రాంతాల్లోనూ పార్టీ బలంగా ఉండాలని ఆయన అనుకుంటున్నారు. అందుకే సమైక్యాంధ్ర పేరుతో ఉద్యమాలు చేపట్టడానికి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆయన పచ్చ జెండా ఊపారు. దాంతో సీమాంధ్ర నేతలు నిరాహార దీక్షలు చేస్తున్నారు, బస్సు యాత్ర చేపట్టారు. తెలంగాణ పార్టీ నేతలు చంద్రబాబు వ్యూహంపై అతి విశ్వాసంతో తెలంగాణ కోసం గట్టిగా మాట్లాడడం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును, కాంగ్రెసు వైఖరిని తప్పు పడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ స్థితిలో తెలంగాణ ప్రజలు తెలంగాణ తెలుగుదేశం నాయకులపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. చంద్రబాబుపై వ్యతిరేకత కూడా అధికంగానే ఉంటుంది. సమైక్యాంధ్రకు అనుకూలంగా చంద్రబాబు ఆ ప్రాంతాల నాయకులను రెచ్చగొడుతున్నారని, వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చి తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని భావించే అవకాశాలున్నాయి. అందువల్ల చంద్రబాబు ఆశించినట్లుగా తెలంగాణలో పార్టీ బలంగా ఉండే అవకాశం లేదు.

ఇక, సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి మాదిరిగా చంద్రబాబు ముందుకు రాకపోవడం రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజలకు అసంతప్తి ఉంటుంది. ఆ అసంతృప్తి తెలుగుదేశం పార్టీపై ప్రభావం చూపుతుంది. తెలుగుదేశం నాయకులు ఎంత ఉధృతంగా ఆందోళనలు చేపట్టడానికి ప్రయత్నించినా అంతగా ఫలితాలు వస్తాయని ఆశించలేం. పైగా, శాసనసభలో తీర్మానం పెడితే బలపరుస్తామని చెప్పిన చంద్రబాబు మాటలు కూడా వ్యతిరేకంగా పనిచేసే అవకాశం లేదు. చంద్రబాబు, చిరంజీవి వంటి ప్రతిపక్ష నాయకులు తీర్మానానికి మద్దతు ఇస్తామని ప్రకటించడం వల్ల వారిపై నమ్మకంతో తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, తీరా ప్రకటనే చేశాక మోసం చేశారని కాంగ్రెసు వర్గాలు అంటున్నాయి. సమైక్యాంధ్రవాదులకు చంద్రబాబు వల్లనే ఇంత దాకా పరిస్థితి వచ్చిందని కాంగ్రెసు నాయకులు సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తుంటే, ప్రతిపక్షాలు అప్పుడో మాట చెప్పి ఇప్పుడో మాట చెబుతున్నాయని తెలంగాణ ప్రజలకు చెబుతున్నారు. దీని వల్ల చంద్రబాబు విశ్వసనీయత మరింత ప్రమాదంలో పడింది. చంద్రబాబుపై ఇది కోస్తాంధ్ర, రాయలసీమల్లో వ్యతిరేకంగా పనిచేస్తుంది.

అయితే, చంద్రబాబు ఉద్దేశం వేరుగా ఉంది. రాష్ట్రంలో సంక్షోభం ఏర్పడినందున మధ్యంతర ఎన్నికలు రావడానికి వీలైన పరిస్థితిని కల్పించాలని చంద్రబాబు అనుకుంటున్నారు. కానీ పరిస్థితి పూర్తిగా తిరగబడే అవకాశం ఉంది. ఇది చంద్రబాబును రాజకీయంగా దెబ్బ తీసే ప్రమాదం ఉంది. గోడ మీది పిల్లివాటం, రెండు పడవల్లో ప్రయాణం ఎప్పటికైనా మంచిది కాదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+