PMAY: పేదల ఇళ్లపై ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! త్వరలో ఇలా..!
ఏపీలో కేంద్రం సాయంతో పేదలకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎంఏవై (PMAY) పథకం కింద ఇళ్ల రేట్లు ఖరారయ్యాయి. ఈ మేరకు గృహనిర్మాణశాఖ మంత్రి పార్ధసారధి ఇవాళ ఓ ప్రకటన చేశారు. పీఎంఏవై అర్బన్ 2.0, పీఎంఏవై రూరల్ పథకాల కింద వేర్వేరు రేట్లు ఖరారు చేశారు. ఇందులో ప్రభుత్వ వాటా ఎంతో, లబ్దిదారులు చెల్లించాల్సిన వాటా ఎంతో మంత్రి వెల్లడించారు.
పీఎంఏవై అర్బన్ 2.0 పథకానికి యూనిట్ ధర రూ. 2.50 లక్షలుగా నిర్ధారించడం జరిగిందని మంత్రి పార్ధసారధి తెలిపారు. ఇందులో రూ.1.50 లక్షలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు అందిస్తాయన్నారు. అలాగే డ్వాక్రా గ్రూప్ లో సభ్యులైన లబ్ధిదారులు బ్యాంకుల నుండి ఆర్థిక సహాయం పొందవచ్చన్నారు. అలాగే అదనంగా స్వచ్ఛభారత్ మిషన్ నుండి మరుగుదొడ్ల నిర్మాణాలకు ఆర్థిక సహాయం అందించడానికి గృహ నిర్మాణ శాఖ కసరత్తు చేస్తుందన్నారు. అర్బన్ హౌసింగ్ పథకంలో ఇప్పటి వరకు 5801 ఇళ్లు పూర్తి చేయడంతో పాటు రూ.178.95 కోట్లు ఖర్చు చేశామన్నారు.

మరోవైపు పీఎంఏవై గ్రామీణ పథకంలో భాగంగా యూనిట్ ధర రూ. 2.39 లక్షలుగా నిర్ధారించడం జరిగిందన్నారు. ఇందులో రూ. 72వేలు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం రూ.48వేలు అందిస్తున్నాయన్నారు. అంతే కాకుండా రూ.80 వేలు వడ్డీ లేని రుణాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అలాగే ఉపాధి హామీ పథకం క్రింద రూ.39వేలు అందిస్తున్నామన్నారు.
స్వర్ణ గ్రామం,వార్డుల్లో పనిచేసే 370 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖకు కేటాయించడంతో గృహ నిర్మాణాలు మరింత వేగవంతం అవుతాయని మంత్రి పార్ధసారధి వెల్లడించారు.

12లక్షల 39వేల 900 ఖాళీ స్థలాల్లో ఇళ్లు మంజూరు చేయాల్సి ఉందని మంత్రి పార్ధసారధి తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకంలో భాగంగా 57,600 గృహాలు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకంలో భాగంగా 684 ఇళ్లు, పీఎం-జనమన్ క్రింద 28,430 ఇళ్లు మొత్తం 86,714 ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు పిఎంఏవై అర్బన్,గ్రామీణ, పియం జన్ మన్ పధకాల కింద 2వేల 102 కోట్ల రూ.లు ఖర్చు చేసి 4లక్షల 56వేల 536 ఇళ్ళను పూర్తి చేశామన్నారు. పక్కా గృహాల నిర్మాణం కోసం అర్హులైన లబ్ధిదారుల నుండి ప్రభుత్వం దరఖాస్తులు కోరగా దాదాపు 10,42,199 దరఖాస్తులు అందాయన్నారు.స్క్రూటినీ అనంతరం నిబంధనల మేరకు 9.50 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించడం జరిగిందన్నారు. వీటిలో మొదటి విడతగా కేంద్రం 74,812 ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు.














Click it and Unblock the Notifications