చిరుకు ముళ్లు అల్లు?

టిక్కెట్ల కేటాయింపు విషయంలో చిరంజీవి అనుసరించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పార్టీ నాయకులు ఒక్కరొక్కరే వీడి పోతున్నారు. డాక్టర్ సమరం పార్టీ రాజీనామా చేశారు. ధన, కుల బలాలు మాత్రమే పార్టీలో పనిచేస్తున్నాయని, డబ్బులున్నవారికే టిక్కెట్లు ఇచ్చారని సమరం తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీని భ్రష్టుపట్టించారని ఆయన ఆరోపిస్తున్నారు.మరో నాయకుడు ఆంజనేయ రెడ్డి కూడా పార్టీని వీడిపోయారు. ఆయనను బుజ్జగించడానికి చిరంజీవి చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆయన తిరిగి పార్టీలోకి రావడానికి ఏ మాత్రం సుముఖంగా లేరు. అలాగే, కెఎస్ఆర్ మూర్తి, పరకాల ప్రభాకర్ నాయకత్వం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. డాక్టర్ మిత్రా కూడా అంత సంతోషంగా లేరని అంటున్నారు. వీరంతా పార్టీ నిర్మాణంలో పని చేసినవారే.
టిక్కెట్లు అమ్ముకున్నారనేది ప్రజారాజ్యం పార్టీ నాయకత్వంపై వస్తున్న ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలు కూడా ప్రధానంగా అల్లు అరవింద్ ను లక్ష్యంగా చేసుకుని వస్తున్నవే. అల్లు అరవింద్ గీసిన గీతను చిరంజీవి దాటరనేది అందరూ ఎరిగిన విషయమే. మొత్తం మీద, అల్లు అరవింద్ చిరంజీవి కొంప ముంచారనేది చాలా అభిప్రాయపడుతున్న విషయం. సామాజిక న్యాయం పేరు చెప్పి పార్టీకి సేవలు చేసినవారికి టిక్కెట్లు నిరాకరించారని ఆరోపిస్తున్నారు. అల్లు అరవింద్ తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నారు.
మొత్తం మీద, ప్రజారాజ్యం పార్టీ పరిస్థితి ఏ మాత్రం సజావుగానూ సక్రమంగానూ లేదు. ఎన్నికల్లో ఆ పార్టీ ముందు ఊహించినట్లుగా విజయ ఢంకా మోగించడం సాధ్యం కాదని పార్టీ వర్గాలే ఒక నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రజారాజ్యం పార్టీకి 50 అసెంబ్లీ స్థానాలు వస్తే ఎక్కువ అనే మాట రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తోంది. పార్టీ ఈ స్థితికి రావడానికి ప్రధాన కారకుడు అల్లు అరవిందేనని పార్టీ వర్గాలు విమర్శిస్తున్నాయి.












Click it and Unblock the Notifications