బాబుకు ఎన్టీఆర్ దృక్పథమేదీ?

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నామని ప్రకటించుకుంటున్నారు. ఎన్టీఆర్ ఆశయాలను సాధిస్తామని చంద్రబాబుతో పాటు ఆయన తనయులు బాలకృష్ణ, హరికృష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించడం ఒక సంప్రదాయంగా మారింది. అయితే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీ రామారావుకు ఉన్న స్పష్టత వారికి ఉందా అనేది అనుమానమే. అలాగే, ఎన్టీఆర్ ఆశయాలేమిటో కూడా వారికి స్పష్టంగా తెలిసే అవకాశం లేదు. ఎన్టీఆర్ అంటే బడుగుల సేవ, మాండలిక వ్యవస్థ వంటి మాటలను వల్లించడం తప్ప ఆయన సామాజిక, రాజకీయ, సాంస్కృతిక దృక్పథమేమిటనేది వారికి తెలుసా, పార్టీకి ఆ దృక్పథం ఉందా అనే ప్రశ్నలు వేసుకుంటే లేదనే సమాధానం చెప్పాల్సి వస్తుంది.

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు నిర్వహించడం సంప్రదాయంగా వస్తున్నప్పటికీ, ఎన్టీఆర్ కు నివాళులు అర్పించడం క్రమం తప్పకుండా జరుగుతున్నప్పటికీ ఆయన దృక్పథాన్ని సమీక్షించిన పాపాన తెలుగుదేశం పార్టీ గానీ ఆయన వారసులు గానీ పోలేదు. ఆ ఆలోచన కూడా వారికి లేదు. దాని వల్లనే తెలుగుదేశం పార్టీ కమ్మ పార్టీగా ముద్రను వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాని వల్ల పార్టీ విస్తృతి తగ్గిపోతూ వస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే దాని పరిధి మరింత కుంచించుకుపోయే ప్రమాదం ఉంది.

సినీ నటుడే అయినప్పటికీ ఆయనకు స్పష్టమైన సామాజిక దృక్పథం ఉందనే విషయాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. శంభూక వధ వంటి పుస్తకాలు రాసిన త్రిపురనేని రామస్వామి చౌదరి ఆ దృక్పథానికి తెలుగు నేల మీద పాదులు వేశారు. బ్రాహ్మణ వ్యతిరేక శూద్ర ఉద్యమానికి అది ప్రారంభం. అయితే ఆంధ్రప్రదేశ్ లో పెద్దగా ప్రచారం లభించకపోయినా అది ఎక్కడో అక్కడ పని చేస్తూనే ఉంది. నేటి దళిత ఉద్యమానికి అది ఊపిరి పోస్తోంది. ద్రావిడ, ఆర్య భిన్నత్వాన్ని ప్రదర్శించుకుంటూ తాము ద్రవిడులమనే సిద్ధాంతాన్ని అది ప్రతిపాదిస్తుంది. తమిళనాడు ప్రాంతీయ పార్టీల రాజకీయ పునాది ఇదే. ఈ సాంస్కృతిక ఛాయలు ఎన్టీఆర్ లో స్పష్టంగా ఉన్నాయి. అందుకే ఆయన రావణ బ్రహ్మ, సుయోధన వంటి ప్రతినాయకులను నాయకులుగా నిలబెట్టే ప్రయత్నం ఎన్టీఆర్ తన సినిమాల ద్వారా చేశారు. అదే ఎన్టీఆర్ సాంస్కృతిక దృక్పథాన్ని కూడా తెలియజేస్తుంది. అంతే కాకుండా ఆయన రాజకీయ మార్గాన్ని కూడా అదే నిర్దేశించింది. కాంగ్రెసు వ్యతిరేకత అనేది ఎన్టీఆర్ గుడ్డిగా అనుసరించింది కాదు. ద్రవిడ - ఆర్య భిన్నత్వం నుంచి, బ్రాహ్మణ - శూద్ర భిన్నత్వం నుంచి అది రూపు దిద్దుకుంది. అదే ఉత్తరాది ఆర్య, బ్రాహ్మణ నాయకత్వంలోని కాంగ్రెసు పార్టీని వ్యతిరేకించడానికి కారణమైంది. అందువల్లనే ఎన్టీఆర్ నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి, కాంగ్రెసుకు సైద్ధాంతిక భిన్నత్వం స్పష్టంగా కనిపించేది. ఇప్పటి తెలుగుదేశం, కాంగ్రెసుల మధ్య తేడా చెరిగిపోయి, ఒకే నాణేనికి బొమ్మా బొరుసుగా కనిపించడం ఎన్టీఆర్ దృక్పథాన్ని విస్మరించడమే.

ఎన్టీఆర్ వి సోషలిస్టు విధానాలు. కులం పునాదిగా సమాజాన్ని విశ్లేషించిన సోషలిస్టు విధానం అది. ఆయన సోషలిస్టుల అభిప్రాయాలకు విశేషంగా ప్రాధాన్యం ఇచ్చారు. ఎక్కువ మంది బీసిలు తెలుగుదేశం వైపు ఉండడానికి కారణం కూడా అదే. తెలుగు నేల మీది సోషలిస్టులు బిసి ప్రాతిపదికగా సోషలిస్టు విధానాలను రూపు దిద్దారు. ఆ విధానం వల్లనే ఆయన కుల ఛాయలను వదిలించుకుని పెద్ద యెత్తున బిసిలను పార్టీలోకి అహ్వానించారు. రాజకీయంగా ఆయన వికేంద్రీకరణవాది. భారతదేశాన్ని ఆయన ఫెడరల్ వ్యవస్థగానే చూశారు. అలా చూడాలని చెప్పారు. అందుకే ఆయన ఢిల్లీ కేంద్రీకృత అధికారాన్ని స్థాపించే గవర్నర్ వ్యవస్థను వ్యతిరేకించారు. ప్రస్తుత తెలుగుదేశం పార్టీ గవర్నర్ వ్యవస్థపై అప్పుడప్పుడూ గుర్తు చేసుకుంటున్నప్పటికీ సారంలో దాన్ని అనుసరించడం లేదు.

మొత్తం మీద, ఎన్టీఆర్ నీడ నుంచి తెలుగుదేశం పార్టీని బయటకు తీసుకురావాలనే చంద్రబాబు ప్రయత్నం వల్ల నష్టం చేస్తోందే తప్ప ఏ మాత్రం ఉపయోగపడడం లేదు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించడం వల్ల ఓట్లు కులప్రాతిపదికపై చీలిపోయేంతగా తెలుగుదేశం పార్టీ కుంచించుకుపోయిందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. కాంగ్రెసు మాత్రం అన్ని కులాల ఓట్లను రాబట్టుకుంది. కాంగ్రెసు పార్టీని రెడ్ల పార్టీగా పిలుస్తున్నప్పటికీ దానికి ఇంకా సంకీర్ణ లక్షణం పోలేదు. దీని వల్లనే లోకసత్తా, ప్రజారాజ్యం పార్టీలు తెలుగుదేశం పార్టీ ఓట్లను మాత్రమే చీల్చగలిగాయి గానీ కాంగ్రెసు ఓట్లను చీల్చలేకపోయాయి. మహానాడు సందర్భంగానైనా చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ దిశగా ఆలోచిస్తే బాగుండేదేమో.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+