వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సబితకు సవాల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
తెలంగాణ ఉద్యమం రాష్ట్ర తొలి హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సవాల్ విసురుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన నేపథ్యంలో తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో అగ్గి రాజుకుంది. విద్యార్థులు స్వచ్ఛందంగా ఉద్యమంలోకి దిగారు. అనూహ్యంగా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. తెలంగాణ వ్యవహారం తెరాస అధ్యక్షుడు కెసిఆర్ ఒక్కరి సంబంధించిందేనని, ఆయన రాజకీయ ప్రయోజనం కోసమేనని చెబుతూ పస్తున్న రాష్ట్ర మంత్రులు, ఇతర కాంగ్రెసు నాయకుల నోళ్లు మూయించేలా ఉద్యమం ఎగిసిపడుతోంది. నిజానికి, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ఇంత పెద్ద యెత్తున ఎగిసి పడుతుందని ప్రభుత్వం అంచనా వేసినట్లు లేదు. కెసిఆర్ ను అదుపు చేస్తే చాలు, పరిస్థితులు చక్కబడుతాయని అనుకుని ఉంటుంది. అంచనాలకు భిన్నంగా వ్యవహారం చేయి దాటి పోయే పరిస్థితి ఏర్పడింది.

వైయస్ జగన్ శిబిరం సృష్టించిన సంక్షోభం నుంచి కాంగ్రెసు పార్టీ అధిష్టానం సహాయంతో ఇప్పుడిప్పుడే బయట పడినట్లు కనిపిస్తున్న ముఖ్యమంత్రి కె.రోశయ్య దీన్ని ఎలా చక్కదిద్దుతారనేది ప్రశ్నార్థకంగానే మారింది. ఆ శక్తి ఆయనకు లేదనే మాట కూడా వినిపిస్తోంది. రోశయ్య కూడా తెలంగాణకు అనుకూలంగా లేరనే విషయం వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ స్థితిలో తెలంగాణ వ్యవహారాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై పడింది. ఆమె ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారనేది కూడా ప్రశ్నార్థకంగానే మారింది. తెలంగాణకు కాంగ్రెసు అధిష్టానం దిగి వస్తే తప్ప అగ్గి చల్లారేలా లేదు. సబితా ఇంద్రారెడ్డికే కాకుండా తెలంగాణ మంత్రులకు కూడా ఇది సంకటంగానే మారింది. ఉద్యమంలో అసాంఘిక శక్తులు, నక్సలైట్లు చొరబడ్డారంటూ సాగించిన ప్రచారానికి పెద్దగా మద్దతు లభించలేదు. దీంతో ఉద్యమాన్ని బలప్రయోగం చేయకుండా అణచేయాల్సిన పరిస్థితిలో సబిత పడ్డారు.

సబిత భర్త మాజీ హోం మంత్రి స్వర్గీయ ఇంద్రారెడ్డి కొంత కాలం తెలంగాణ ఉద్యమాన్ని నడిపారు. తనకు తగిన మద్దతు లభించకపోవడంతో ఆయన కాంగ్రెసు పార్టీలో చేరారు. ఇంద్రారెడ్డిపై తెలంగాణవాదులకు, విద్యార్థులకు గౌరవ భావం ఉంది. ఇంద్రారెడ్డి భార్యగా తెలంగాణకు అనుకూలంగా సబితా ఇంద్రారెడ్డి వ్యవహరించాలని విద్యార్థులు కోరుకుంటున్నారు. ఈ విషయం వారి ప్రకటనల్లో,నినాదాల్లో కూడా వ్యక్తమవుతోంది. తీవ్ర సంకట స్థితిలో పడిన సబిత తెలంగాణా మంత్రులతో నిరంతర సమావేశాలు ఏర్పాటు చేస్తూ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. రోశయ్య మాత్రం చేతులు ముడుచుకుని కూర్చున్నట్లే కనిపిస్తున్నారు. శాసనసభలో తెలంగాణ తీర్మానం ప్రతిపాదించేది లేదని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. అందువల్ల సబితపై మోయలేని భారం పడింది. తెలంగాణ మంత్రులంతా ఏదో ఒక రకంగా తెలంగాణ ఆకాంక్షకు అనుకూలంగా వ్యవహరించాల్సిన అగత్యంలో పడ్డారు. సబిత మరింతగా ఇరకాటంలో పడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X