నువ్వా నేనా?

తిరిగి అధికారం మాదేనని వైయస్ రాజశేఖర రెడ్డి ధీమా వ్యక్తం చేస్తుండగా, అధికారం మాదేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అంటున్నారు. రాష్ట్రంలో నిశబ్ద విప్లవం వస్తుందని, ఓటర్లు తమకే పట్టం కడుతారని చిరంజీవి చెబుతూ వచ్చారు. అయితే చిరంజీవి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టడానికి తగిన సీట్లను సాధించుకోలేరని గట్టిగానే వాదనలు వినిపిస్తున్నాయి. పోటీ చంద్రబాబుకు, వైయస్ రాజశేఖర రెడ్డికి మధ్యనే ఉండే అవకాశాలున్నాయి. అయితే ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగిన మెజారిటీ రాదని, ఈ స్థితిలో చిరంజీవి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తారనే మాట కూడా వినిపిస్తుంది.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని మహా కూటమి ఆధిక్యత సాధిస్తుందని అంటున్నారు. తొలి విడత పోలింగ్ జరిగిన 154 అసెంబ్లీ స్థానాల్లో 90 దాకా గెలుచుకుంటుందని అంచనాలు వేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో చిరంజీవి పాగా వేసినట్లు భావిస్తున్నారు. మిగతా కోస్తా జిల్లాల్లో మూడు పార్టీలు కూడా సీట్లను పంచుకుంటాయని అంటున్నారు. రాయలసీమలో కాంగ్రెసుకు కొద్దిపాటి ఆధిక్యత మాత్రమే వస్తుందని భావిస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబుకు, రాజశేఖర రెడ్డికి మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ సాగింది.












Click it and Unblock the Notifications