'మెగా' ఫెయిల్యూర్

చిరంజీవి సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల బలపడకుండా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు చెక్ పెట్టాయి. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల నాయకులు సమైక్యాంధ్ర నినాదంతో ఉద్యమాలకు దిగాయి. జెఎసి సమావేశాలు నిర్వహించాయి. ఈ జెఎసి సమావేశాలకు చిరంజీవిని ఆహ్వానించలేదు. సమైక్యాంధ్ర ఉద్యమ ఫలాలు చిరంజీవికి దక్కకుండా ఆ పార్టీలు రంగంలోకి దిగాయి. రాష్ట్ర విభజనను తామే అడ్డుకుంటామనే విధంగా వ్యవహరించాయి. దీంతో చిరంజీవి కన్నా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు బలంగా తయారైనట్లు చెబుతున్నారు.
తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి, సీమాంధ్రలో చిరంజీవి బలపడకుండా, ఆ రెండు పార్టీలను దెబ్బ తీసేందుకు తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నట్లు అర్థమవుతోంది. తెరాస శాసనసభ్యులు రాజీనామా చేసే వరకు తెరాసలో కొనసాగిన కాంగ్రెసు ఆ తర్వాత తప్పుకుంది. తెలుగుదేశం శాసనసభ్యులు కాంగ్రెసు పేరు చెప్పి రాజీనామాలకు దిగలేదు. దీంతో తెలంగాణ ఉద్యమంలో తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఒంటరివారయ్యారు. అలాగే, సీమాంధ్రలో చిరంజీవి కూడా ఒంటరివాడయ్యారు. ఏమైనా, రాజకీయ వ్యూహరచనలో చిరంజీవి వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.