చిరంజీవి ఏక్ నిరంజన్

ఆయన వ్యవహార శైలి వల్ల తమ్ముళ్లు పవన్ కళ్యాణ్, నాగబాబు ప్రజారాజ్యం పార్టీకి దూరమయ్యారు. వారు చిరంజీవి రాజకీయాల గురించి గానీ ప్రజారాజ్యం గురించి గానీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. తమ పనేదో తాము చేసుకుంటూ గమ్మున నోరు మూసుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటుకు పునాదులు ఏర్పాటు చేయడానికి నాగబాబు కాలికి బలపం కట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. అభిమానులను కూడగట్టి ఒక పార్టీ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ప్రజాకర్షణ శక్తిగా మారి అన్నయ్య చిరంజీవిని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు. కానీ వారి ఆశలు నీరు గారాయి. చిరంజీవి వ్యవహార శైలి అధికారాన్ని అందించే పరిస్థితి లేదని ఎన్నికల ప్రచారం సాగుతుండగానే వారు మెల్లగా తప్పుకున్నారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆయనకు వెన్నుదన్నుగా నిలిచి కొత్త సమీకరణాలతో రాష్ట్ర రాజకీయాలను నడిపిద్దామని ఆశించిన సీనియర్ నాయకులు అందరూ ఒక్కరొక్కరే గూడు వీడిపోయారు. చిరంజీవి చేత పార్టీ పెట్టించడానికి నానా యాతన పడిన హరిరామ జోగయ్య వంటి నాయకులు కూడా ఆశలు వదులుకున్నారు. పార్టీకి స్పష్టమైన రాజకీయ నిర్దేశాన్నిచ్చి, సైద్ధాంతిక ప్రాతిపదికను కల్పించి ప్రజలను దగ్గరచేసుకోవడానికి తెర వెనక రాత్రింబవళ్లు పనిచేసిన మిత్రా, ప్రభాకర్ వంటి నాయకులూ వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయన వెంట కొద్ది మంది నాయకులు, పార్టీ శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు. వారు కూడా చిరంజీవి మాటలను ఖాతరు చేసే పరిస్థితి లేదు. పార్టీ శాసనసభ్యులు చెప్పినట్లల్లా ఆయన నడుచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. లేదంటే వారంతా కట్టగట్టుకుని గోడ దూకే వాతావరణమే ఉంది. అందుకే ఆయన ఇద్దరు శాసనసభ్యులు మాత్రమే ఉన్న విశాలమైన తెలంగాణ ప్రాంతాన్ని వదులుకుని 16 మంది శాసనసభ్యులున్న సీమాంధ్ర ఎమ్మెల్యేల కోసం సమైక్య నినాదాన్ని అందుకున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్తానని ఆయన అంటున్నారు. దానికి ప్రాతిపదికనే లేదనే విషయాన్ని ఆయన గుర్తించడం లేదు. అలాంటప్పుడు ఆయన సమైక్యాంధ్ర ఉద్యమం ద్వారా సాధించేదేమీ లేదు. భవిష్యత్తులో ఆయన రెంటికి చెడ్డ రేవడి కావచ్చు. ఆయన ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి కూడా ఎంతో దూరంలో లేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications