డిఎస్ కు తెలంగాణ వాతలు

జెఎసి నిర్ణయానికి విరుద్ధంగా డిఎస్ మందుకు సాగడానికి చేసిన ప్రకటనకు తీవ్రంగా వ్యతిరేకత ఎదురవుతోంది. కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు పి. శంకరరావు డిఎస్ ప్రకటనను వ్యతిరేకించారు. తెరాస శాసనసభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అన్నారు. అయితే, తెరాస శాసనసభ్యులు రాజీనామా చేయడాన్ని కూడా ఆయన సమర్థించలేదు. తెరాస తొందరపడి రాజీనామాలు చేసిందని ఆయన అన్నారు. తెరాస శాసనసభ్యులకు వ్యతిరేకంగా పోటీ దింపినా ప్రజల నుంచి కాంగ్రెసుకు తీవ్ర వ్యతిరేకత రావచ్చు. డిఎస్ ప్రకటనను మరో కాంగ్రెసు సీనియర్ నేత జీవన్ రెడ్డి కూడా వ్యతిరేకించారు. డిఎస్ ఏ సందర్భంలో పోటీ చేస్తామన్నారో తెలియదు గానీ కాంగ్రెసు పోటీ చేయకూడదని ఆయన అన్నారు. జెఎసిలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు. సీనియర్ శాసనసభ్యుడు ఆర్ దామోదర్ రెడ్డి కూడా డిఎస్ ప్రకటనను వ్యతిరేకించారు. తెరాస శాసనసభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసికెళ్తామని ఆయన చెప్పారు.
కాగా, తెరాస నాయకులు డిఎస్ ప్రకటనపై తీవ్రంగా మండిపడుతున్నారు. డిఎస్ కు సవాళ్లు విసురుతున్నారు. దమ్ముంటే నిజామాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని తెరాస నాయకుడు హరీష్ రావు డిఎస్ ను సవాల్ చేశారు. కాంగ్రెసు పోటీ చేస్తే తీవ్రంగా దెబ్బ తీయాలనే ఎత్తుగడలో తెరాస ఉంది. డిఎస్ ప్రకటనను తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండరామ్ ద్రోహపూరిత చర్యగా వ్యాఖ్యానించారు. మొత్తం మీద, డిఎస్ కు తెలంగాణ వాతలు తీవ్రంగా పడుతున్నాయి. ఆయనపై మరింత వ్యతిరేకత రావచ్చు.