• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అటు గాలి, ఇటు జగన్

By Pratap
|

Gali Janardhan Reddy-YS Jagan
కాంగ్రెసు పార్టీ అధిష్టానం కర్నాటకలో గాలి జనార్దన్ రెడ్డిని, ఆంధ్రప్రదేశ్ లో వైయస్ జగన్ ను టార్గెట్ చేసుకుంది. మైనింగ్ మాఫియా రాజకీయాలను శాసిస్తుండని భావిస్తున్న కాంగ్రెసు నాయకత్వం వారిద్దరిని అదుపు చేయడమే కాకుండా వారిని దెబ్బ తీయాలనే తీవ్ర ప్రయత్నంలో ఉంది. మైనింగ్ ఆదాయంతోనే గాలి జనార్దన్ రెడ్డి సోదరులు కర్నాటక రాజకీయాలను శాసిస్తుండడమే కాకుండా కాంగ్రెసును తీవ్రంగా దెబ్బ తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెసు నాయకత్వం భావిస్తోంది. అదే సమయంలో వైయస్ జగన్ అలా వచ్చిన ఆదాయంతోనే ఇప్పుడు తమను బ్లాక్ మెయిల్ చేస్తూ, ధిక్కరిస్తూ సాగడానికి సిద్ధపడ్డారని అనుకుంటోంది. దీంతో వీరిని కట్టడి చేయకపోతే రాజకీయాలు వారి చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని భావిస్తోంది.

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమ తవ్వకాలపై చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపక్షాల నాయకులతో పాటు అధికార కాంగ్రెసు పార్టీ నాయకులు కూడా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ తవ్వకాలను కట్టడి చేయడానికి రోశయ్య ముఖ్యమంత్రిగా వచ్చినప్పుటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబునాయుడు, రాఘవులు, నారాయణ ఆరోపణలను సాకుగా తీసుకుని ఓబుళాపురం మైనింగ్ కంపెనీపై చర్యలు తీసుకుంటూ వస్తోంది. ఇప్పుడు నేరుగా కాంగ్రెసు రంగంలోకి దిగి గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్స్ ను దెబ్బ కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే రాష్ట్ర గవర్నర్ హెచ్ఎం భరద్వాజ గాలి జనార్దన్ రెడ్డి వర్గానికి చెందిన మంత్రులకు ఉద్వాసన పలకాల్సిందేనని పట్టుబడుతున్నారని అంటున్నారు. భరద్వాజ్ గాలి బ్రదర్స్ తో ప్రత్యక్ష యుద్ధానికి దిగారు. వారిపై రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కు కూడా ఫిర్యాదు చేశారు.

మరో వైపు, గాలి బ్రదర్స్ కంపెనీ వ్యవహారాలపై కర్నాటక శాసనసభ అట్టుడుకుతోంది. కాంగ్రెసు నాయకుడు సిద్ధరామయ్య గాలి బ్రదర్స్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మైనింగ్ మాఫియా పని పడతామని భరద్వాజ్ మీడియాతోనే అన్నారు. ముఖ్యమంత్రి యెడ్యూరప్పను సవాల్ చేసిన గాలి బ్రదర్స్ తమ పంతాలను నెగ్గించుకున్నారు. గాలి బ్రదర్స్ ఎత్తుగడలకు బిజెపి అగ్ర నాయకత్వం కూడా దిగి వచ్చి ముఖ్యమంత్రి యెడ్యూరప్పతో సంధి కుదిర్చించింది. అప్పటి నుంచి గాలి బ్రదర్స్ కు ఎదురు లేకుండా పోయింది. దీంతో కాంగ్రెసు పార్టీ నేరుగా రంగంలోకి దిగి గాలి బ్రదర్స్ మెడలు వంచడానికి పూనుకుంది. ఆంధ్రప్రదేశ్ లో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి అండదండలతో మైనింగ్ కార్యకలాపాల్లో గాలి జనార్దన్ రెడ్డి విపరీతంగా సంపాదించారు.

వైయస్ జగన్ కూడా మైనింగ్ ఆదాయంతోనే రాజకీయాలను శాసించాలనుకుంటున్నారనే అభిప్రాయం బలంగా నాటుకుంది. జగన్ ఓదార్పు యాత్రకు గాలి జనార్దన్ రెడ్డి ఆర్థిక వనరులు సమకూరుస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. వైయస్ కుటుంబ సభ్యులు కూడా మైనింగ్ కార్యకలాపాల్లోకి విస్తృతంగా ప్రవేశించారని అంటున్నారు. వైయస్ అల్లుడు అనిల్ కుమార్ ఖమ్మం జిల్లాలోని బయ్యారం మైనింగ్ కార్యకలాపాల్లో సంపాదనకు పూనుకున్నారని ప్రతిపక్షాలు విమర్సిస్తున్నాయి. అనిల్ కుమార్ కు చెందిన రక్షణ స్టీల్స్ కు బయ్యారం గనులను అప్పన్నంగా కట్టబెట్టారని ప్రతిపక్షాలు విమర్సిస్తున్నాయి. బయ్యారం గనుల అక్రమాలపై ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ కూడా అట్టుడుకుతోంది. అయితే, తమ కంపెనీతో అనిల్ కుమార్ కు సంబంధం లేదని రక్షణ స్టీల్స్ సిఇవో అంటున్నారు. కానీ, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాష్ట్రంలోని ప్రధానమైన, విలువైన ఖనిజ సంపదను, భూములను వైయస్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు కొల్లగొట్టే కార్యక్రమాల్లో నిమగ్నమై పోయారనేది మాత్రం కాదనలేని మాట అని అంటున్నారు. అలా జరిగి ఉండకపోతే అనతి కాలంలోనే వైయస్ జగన్ దేశంలో అత్యధికంగా పన్ను చెల్లించే రాజకీయ నాయకుడిగా రికార్డు ఎలా సృష్టించగలుతాడనేది ప్రశ్న. ఆదాయం పన్ను చెల్లింపులో జగన్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతిని జగన్ మించిపోయాడు. అంత ఆదాయం జగన్ కు ఎలా సమకూరిందో వెల్లడించాలని చంద్రబాబు నాయుడు చాలా కాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. వైయస్ కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణ జరిపించాలని అధికార కాంగ్రెసు శాసనసభ్యుడు పి. శంకర రావు తాజాగా డిమాండ్ చేస్తున్నారు.

వేర్వేరు పార్టీలో ఉన్నా గాలి జనార్దన్ రెడ్డి, వైయస్ జగన్ లకు మధ్య గాఢానుబంధం ఉంది. కర్నాటక రాజకీయాలను ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డి శాసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించడానికి వైయస్ జగన్ ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలను తన చెప్పుచేతుల్లోకి తీసుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడని, గాలి జనార్దన్ రెడ్డి కర్నాటకలో బిజెపి ప్రభుత్వాన్ని, అధినాయకత్వాన్ని మెడలు వంచి శాసించినట్లుగానే, ఆంధ్రప్రదేశ్ లో వైయస్ జగన్ చేయాలనుకుంటున్నాడనేది కాంగ్రెస్ హైకమాండ్ అభిప్రాయంగా కనిపిస్తోంది. అందుకే జగన్ ను కట్టడి చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X