• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణ ఉద్యమంలో మావోలున్నారా?

By Pratap
|

Maoists
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మావోయిస్టులున్నారని కాంగ్రెసుకు చెందిన కోస్తాంధ్ర పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. కావూరి సాంబశివరావుపై తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు మాత్రమే కాకుండా సొంత కాంగ్రెసు పార్టీ నాయకులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి ఆర్ దామోదర్ రెడ్డి కావూరిపై నిప్పులు చెరిగారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చి చూస్తే కావూరి విషయం అర్థమవుతుందని ఆయన అన్నారు. నిజానికి, మావోయిస్టుల ప్రాబల్యం ఉద్యమాల్లో చాలా వరకు తగ్గింది. తెలంగాణలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గడానికి కారణాన్ని కోస్తాంధ్ర, రాయలసీమ నాయకులు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి అంటగడుతున్నారు. కానీ వాస్తవం అది కాదు. సీమాంధ్ర నాయకులకు సహజంగానే తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లోని పరిస్థితులు గానీ గత యాభై ఏళ్లలో సంభవించిన పరిణామాలు గానీ తెలియదని స్పష్టంగా చెప్పవచ్చు. వారంతా ఎక్కువగా హైదరాబాదుకే పరిమితమయ్యారు గానీ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి వాస్తవాలు గ్రహించిన పాపాన పోలేదు. తెలంగాణ సమాజాన్నంతటినీ నక్సలైట్ల గాటన కట్టేసిన ఘనత కూడా వారికే దక్కుతుంది. అందుకు తెలంగాణలోని వాస్తవ ప్రయోజనాలు తెలియకపోవడం ఒక కారణమైతే, స్వప్రయోజనాలు మరొక కారణం. తెలంగాణవారిని నక్సలైట్లుగా ముద్ర వేసి పాలనా యంత్రాంగానికి, అధికార యంత్రాంగానికి, పార్లమెంటరీ వ్యవస్థకు దూరం చేశారు.

1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం విఫలమైన తర్వాత నక్సలైట్ ఉద్యమం ఊపందుకుంది. ఆ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న విద్యాధికులైన ఒక తరం యువత నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్లింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం విఫలం కావడం అందుకు ఒక ప్రధానమైన కారణమని చెప్పవచ్చు. ఆ తర్వాత తెలంగాణలో పరిస్థితులు మారాయి. విద్యాధికులు, చదువుకున్నవారు పెరుగుతూ వచ్చారు. కోస్తాంధ్రలో 1950 దశకంలోనే మధ్య తరగతి ఎదగగా, తెలంగాణలో 1970లో ఆ వర్గం ఎదగడం మొదలైంది. అయితే ఆ కాలంలోని చదువుకున్న వారు తెలివైనవారంతా నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్లడంతో ప్రజాస్వామిక వ్యవస్థలో తెలంగాణవారి పాత్ర తగ్గింది. క్రమంగా నిర్బంధం పెరిగి, గ్రామాల్లో యువకులు కూడా ఉండలేని నిర్బంధ వాతావరణం వచ్చేసింది. మళ్లీ పూర్వ స్థితి రావడానికి నలబై ఏళ్లు పట్టింది. ఇప్పుడు అగ్రవర్ణాలకు చెందినవారే కాకుండా బలహీన వర్గాలకు, దళితులకు చెందిన వారు బాగా చదువుకున్నారు. ఆ వర్గాల నుంచి మధ్య తరగతి రావడం ప్రారంభమైంది. వీరు నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్లి త్యాగాలు చేయడానికి సిద్ధంగా లేరు. ప్రజాస్వామిక ఉద్యమాల ద్వారా తమ హక్కులను, తమ సాధికారితను సాధించుకోవడానికి పూనుకున్నారు. మాదిగ దండోరా ఉద్యమం అందుకు ఒక ప్రబల నిదర్శనం.

మావోయిస్టుల పాత్ర ప్రస్తుత ఉద్యమంలో ఉండకూడదని ఉద్యమ నేతలు భావిస్తున్నారు. ఆ మేరకు వారికి తగిన సూచనలు కూడా చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి దూరంగా ఉండాలని జిలుకర శ్రీనివాస్ అనే ఓ దళిత మేధావి సభా ముఖంగా విరసం నాయకుడు వరవరరావుకు సభాముఖంగా విజ్ఞప్తి చేశారు. నక్సలైట్లు నాయకత్వం వహిస్తున్నారనే అభిప్రాయం కలిగించడం వల్ల తమకు నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. దీన్ని బట్టి వాస్తవ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. చాలా తెలంగాణ మేధావులు కూడా గతంలో నక్సలైట్ ఉద్యమమే అంతిమం అనుకున్నవారు కూడా ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ కోసం పనిచేస్తున్నారు. తెలంగాణలో గౌరవంగా జీవించడానికి అనువైన వాతావరణం ఏర్పడడానికి ప్రజాస్వామిక ఉద్యమాలే మార్గమనే గట్టి నిర్ణయానికి వచ్చి నక్సలైట్ ఉద్యమాలకు దూరం జరిగినవారే ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. ఈ పరిణామ క్రమాన్ని చూడకుండా కావూరి లాంటి కోస్తాంధ్ర నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ప్రస్తుతం దళితులు, ముఖ్యంగా మాదిగలు నడిపించడానికి ప్రయత్నిస్తున్నారు. వారే నాయకత్వం వహించడానికి తగిన ప్రాతిపదిక ఏర్పాటు చేసుకుంటున్నారు. వీరు నక్సలైట్లతో మమేకం కావడానికి సిద్ధంగా లేరు. ప్రజాస్వామిక ఉద్యమాల ద్వారానే తాము తమ హక్కులను సాధించుకుంటామని వారు స్పష్టంగా చెబుతున్నారు. అయితే, ఈసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం విఫలమైతే మాత్రమే నక్సలైట్ ఉద్యమం పెరిగే అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యమం విఫలమైతే సంభవించే ప్రమాదాన్ని తెలంగాణ మేధావులు గుర్తించారు కాబట్టి ఎంత తీవ్రస్థాయిలోకైనా వెళ్లడానికి సిద్ధపడుతున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన ప్రభావం తమపై పడే అవకాశం లేదు కాబట్టి కోస్తాంధ్ర, రాయలసీమ నాయకులు మావోయిస్టుల బూచీని చూపెడుతున్నారు. తెలంగాణ విధ్వంసానికి మరోసారి కుట్ర చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X