కెసిఆర్ చెడగొడుతున్నారా?

ఒత్తిడి పెడుతున్నప్పటికీ పార్టీ అధిష్టానం అడుగు ముందుకు వేయకపోవడంతో కాంగ్రెసు ప్రజాప్రతినిధుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజల్లో, విద్యార్థుల్లో ఉన్న ఆకాంక్షకు అనుగుణంగా వ్యవహరించలేకపోవడమే అందుకు కారణం. ప్రజాప్రతినిదులంతా రాజీనామాలు చేసి రావాల్సిందేనని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. రాజీనామాలు చేసిన వారిని ఏకగ్రీవంగా ఎన్నిక చేయించే బాధ్యత తమదని వారు చెబుతున్నారు. వారి మాటలను కాదని ప్రజల్లోకి వెళ్లలేని స్థితి తెలంగాణలోని ప్రజాప్రతినిధుల్లో నెలకొంది. దీంతో కాంగ్రెసు మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు ఇరకాటంలో పడ్డారు. ఈ స్థితిలో వారు జెఎసిని మరింత గడువు కోరే దిశలో కదులుతున్నట్లు సమాచారం. జెఎసి నుంచి బయటకు రావాలనే అభిప్రాయం కూడా కొంత మంది తెలంగాణ కాంగ్రెసు నాయకుల్లో ఉంది. అయితే అందుకు కూడా చాలా మందికి అవకాశం లేకుండా పోయింది. ప్రత్యక్ష ఎన్నికల్లో జయాపజయాలు నిర్ణయించుకోలేని వి. హనుమంత రావు వంటి నాయకులే ఆ విధంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ఉంది.
క్లైమాక్స్ లో చెడగొట్టడం కెసిఆర్ కు అలవాటుగా మారిందని హనుమంతరావు అన్నారు. అంతా బాగా ముందుకు తెచ్చి చివరలో చెడగొడతారని ఆయన అంటున్నారు. రాజీనామాల విషయంలో ఒత్తిడి విషయంలో కూడా కెసిఆర్ ఆ విధంగానే వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శిస్తున్నారు. రాజీనామాలను ఆమోదింపజేసుకుంటే రాష్ట్రపతి పాలన వచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో జాప్యం జరుగుతుందని ఆయన వాదిస్తున్నారు. సీమాంధ్ర నాయకులు కూడా ఇదే వాదనను ముందుకు తెస్తున్నారు. అయితే, రాజీనామాల విషయంలో తెలుగుదేశం నాయకులు కాస్తా పట్టు సడలించినట్లు కనిపిస్తోంది. తమకు ఎన్నికలు రావాలనే ఉద్దేశం ఉందని, తెలంగాణపై కన్నా ఎన్నికలపైనే ఆసక్తి ఉందనే అభిప్రాయం వల్ల చెరుపు జరిగే ప్రమాదం ఉందని గ్రహించిన తెలుగుదేశం తెంలగాణ నాయకులు కాస్తా పట్టు సడలించినట్లు కనిపిస్తోంది. రాజీనామాల విషయంలో తాము జెఎసి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, రాజీనామాల గడువు పెంచే విషయంపై జెఎసి నిర్ణయం తీసుకుంటుందని తెలుగుదేశం నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. ఢిల్లీకి వెళ్లిన దామోదర్ రెడ్డి, జానారెడ్డి మంచి వార్త తెస్తారనే నమ్మకం ఉందని ఆయన బుధవారం అన్నారు. తాము అనుసరించాల్సిన వ్యూహం చర్చించడానికి వారు బుధవారం సమావేశమయ్యారు.
మొత్తం మీద, కెసిఆర్ వ్యూహం ఫలిస్తుందా, చివరి నిమిషంలో బెడిసి కొడుతుందా అనేది వేచి చూడాల్సిందే. ఇటు తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం ముందుకు కదిలే పరిస్థితి రావడంతోనే సీమాంధ్ర నాయకులు గొంతు విప్పారు. రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, శైలజానాథ్ మరో సారి తమ గొంతు విప్పి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారు.












Click it and Unblock the Notifications