శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఆలోచన ఏమిటి?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యూహం ఏమిటనేది అంతు పట్టకుండా ఉంది. ఒక వైపు కాంగ్రెసులోనే ఉంటానంటూ మాటిమాటికీ పార్టీ అధిష్టానం ఆదేశాలను ధిక్కరించేందుకు సిద్ధపడడంలోని ఆంతర్యమేమిటనే విషయంపై రాష్ట్ర రాజకీయాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. జగన్ మొండి వైఖరిని, ధిక్కార స్వరాన్ని పార్టీ అధిష్టానం ఏ మేరకు సహిస్తుందనేది కూడా అంతు పట్టడం లేదు. అంతర్గతంగా జగన్, పార్టీ అధిష్ఠానం ముఖాముఖి తలపడుతున్న సూచనలే కనిపిస్తున్నాయి. తీవ్రమైన చర్యలకు పాల్పడేలా పరస్పరం ప్రోత్సహించుకుంటున్నట్లుగా కూడా అనిపిస్తోంది.

జగన్ తీవ్రమైన చర్యలకు దిగి తనంత తానుగా బయటకు వెళ్లిపోవాలని పార్టీ అధిష్టానం ఆలోచిస్తోందనే వాదన కూడా ఉంది. అదే సమయంలో తనపై అధిష్టానం తీవ్రమైన చర్యలు తీసుకుని బయటకు నెట్టేసే పరిస్థితిని కల్పించాలనేది జగన్ వ్యూహంగా కూడా వాదన సాగుతోంది. అపవాదు నుంచి తప్పించుకుని ఎదుటి పక్షంపై ఆరోపణలు చేసుకోవడానికి పరస్పరం కాచుకుని ఉన్నట్లు భావిస్తున్నారు. ఒక రకంగా ఒక ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్నట్లు తెలుస్తోంది.

పార్టీ అధిష్టానం చర్యలు తీసుకునేలా ఉసిగొల్పడమే ప్రస్తుతం జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. అధిష్టానం తనపై తీవ్రమైన చర్యలు తీసుకున్న తర్వాత వేరు కుంపటి రాజేయాలని, పార్టీని నిలువునా చీల్చాలని జగన్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు ఆయన కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అండదండలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జగన్ బయటకు రాగానే గాలి జనార్దన్ రెడ్డి బిజెపి తరఫున రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని అంటున్నారు. ఆ రకంగా రాష్ట్రంలో బహుముఖ పోటీకి బలాలను మోహరింపజేయాలనేది జగన్, గాలి జనార్దన్ రెడ్డి ఆలోచనగా చెబుతున్నారు. దాంతో చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలను బలహీన పరిచి రాజకీయ అస్థిరతను సృష్టించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

రాజకీయ అస్థిరతకు మార్గం వేయడం ద్వారా సంకీర్ణ రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ లో పునాది వేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దాని వల్ల కాంగ్రెసుతో స్నేహ హస్తం చాచడానికి వీలవుతుందని జగన్ అనుకుంటున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ విషయంలో ఆయనకు ఎన్సీపి నేత శరద్ పవార్, తృణమూల్ కాంగ్రెసు నేత మమతా బెనర్జీ మార్గదర్శకులని అంటున్నారు. తద్వారా వీలైనంత త్వరగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి వీలవుతుందని ఆయన అనుకుంటున్నారు. కాంగ్రెసు అధిష్టానం మాట విని అణిగిమణిగి ఉంటే ముఖ్యమంత్రి పదవి దక్కడానికి రెండు దశాబ్దాలు పట్టినా ఆశ్చర్యం లేదని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. అందువల్ల ధిక్కారమే తన రాజకీయ భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని జగన్ అనుకుంటున్నట్లు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X