జగన్ వ్యూహం మారిందా?

పార్టీ అధిష్టానం తన ఓదార్పు యాత్రకు బెదిరిపోతుందని తొలుత వైయస్ జగన్ భావించినట్లున్నారు. అయితే, అందుకు విరుద్దమైన ఫలితాలు వస్తున్నాయి. శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల ఓదార్పు యాత్రల విషయంలో అంతగా వదిలేసినట్లు కనిపించిన అధిష్టానం ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్రకు వచ్చేసరికి పూర్తిగా కట్టడి చేయడానికి ప్రయత్నించింది. జగన్ ఓదార్పు యాత్రకు శాసనసభ్యులు, పార్టీ నాయకులు వెళ్లకుండా చర్యలు తీసుకుంది. ప్రకాశం జిల్లా శాసనసభ్యులను ఢిల్లీకి పిలిపించి ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని చెప్పింది. దీంతో ఒక్క శాసనసభ్యుడు, ఓ మంత్రి మినహా ఎవరు కూడా జగన్ ఓదార్పు యాత్ర వైపు చూడలేదు. ద్వితీయ శ్రేణి నాయకులతో శాసనసభ్యులపై ఒత్తిడి తేవాలన్న జగన్ వర్గం వ్యూహం కూడా ఫలించలేదు.
ప్రకాశం డిసిసి అధ్యక్షుడు గోపాల్ రెడ్డికి పిసిసి షోకాజ్ నోటీసు జారీ చేయడమే కాకుండా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పార్టీ శాసనసభ్యులు, నాయకులు చాలా మంది జగన్ ఓదార్పు యాత్రకు రావడం లేదు. పైగా, ఓదార్పు యాత్రను నిరంతరాయంగా కొనసాగించడం కూడా కష్టంగానే ఉంది. ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్రలో ఆయన అనారోగ్యం పాలయ్యారు. దానికి తోడు వైయస్సార్ హయాంలో తాను సంపద పోగు చేయడానికి చేసిన పనులన్నీ ఒక్కటొక్కటే బయటకు వస్తున్నాయి. ఇదంతా తట్టుకోవడం వైయస్ జగన్ కు అంత సులభం కాదు. ఆయన ఆస్తుల వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ స్థితిలో జగన్ దిగి వచ్చి వచ్చే ఎన్నికల నాటికి తనకు ముఖ్యమంత్రి పదవి లభించేలా పార్టీ అధిష్టానం ముందుకు రావాలనే యోచనతోనే బాలినేని శ్రీనివాస రెడ్డితో ప్రకటన ఇప్పించినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications