సీమాంధ్రుల టార్గెట్ కోదండరామ్

కోదండరామ్ ''ప్రొఫెసర్‌గా ఉంటూ జేఏసీ పేరిట విద్యార్థులను రెచ్చగొడుతూ భ్రష్టు పట్టిస్తున్నారు. కాలేజీలకు వెళ్లి పాఠాలు చెప్పకుండా లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటున్నారు. ఆయనతోపాటు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు డ్యూటీలకు వెళ్లకుండా జీతాలు తీసుకుంటున్నారు. అలాంటి వారిపై ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఫిర్యా దు చేద్దాం. ముఖ్యంగా కోదండరాం వ్యవహారాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళదాం"" అన్న ప్రతిపాదనకు సీమాంధ్ర కాంగ్రెసు ప్రజాప్రతినిధుల సమావేశం ఆమోదం తెలిపింది.
కోదండరామ్ వ్యూహాలకు, వాటి అమలుతో తలెత్తుతున్న పరిణామాలకు తెలంగాణ కాంగ్రెసు నేతలు మద్దతు తెలపడం కూడా సీమాంధ్ర నాయకులకు మింగుడు పడడం లేదు.''ఏఐసీసీ, పీసీసీలో ముఖ్య పదవుల్లో ఉన్నవారు కూడా రెచ్చగొట్టేలా మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఎంపీలే ఈ వివాదానికి కారణం. పార్టీలు మారిన వారు, విదేశాల నుంచి డబ్బు సంచులతో వచ్చి టికెట్లు తెచ్చుకుని ఎంపీలైన వారే న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ముందు వీళ్లను నియంత్రించాలి. లేకుంటే రాష్ర్టంలో పార్టీ ప్రతిష్ట దిగజారే ప్రమాదముంది. ఈ విషయంపై హైకమాండ్‌ను కలిసి ఫిర్యాదు చేయాలి"" అని అభిప్రాయపడింది. ముఖ్యంగా పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ తీరుపై వారు కన్నెర్ర చేస్తున్నారు.
కోదండరామ్ తీరు వల్ల వ్యవహారాలు తమ చేయి దాటి పోయే ప్రమాదం ఉందనే ఆందోళన సీమాంధ్ర నాయకుల్లో కనిపిస్తోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అయిన కోదండరామ్ విద్యార్థులను ఉద్యమం వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి, మిగతా ప్రజా సంఘాలకు మధ్య సమన్వయం సాధిస్తూ తెలంగాణ ఉద్యమం సజీవంగా ఉండే విధంగా కార్యాచరణ రూపొందించి అమలు చేయడంలో కోదండరామ్ నిమగ్నమైనట్లు భావిస్తున్నారు. దీంతో కోదండరామ్ పైనే సీమాంధ్ర దృష్టి కేంద్రీకృతమైంది.












Click it and Unblock the Notifications