వర్మ చేసిన తప్పేమిటి?

రామ్ గోపాల్ వర్మను వెధవగా, బ్రోకర్ గా అభివర్ణిస్తున్నారు. అనంతపురం జిల్లా పరువు తీసే విధంగా సినిమా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. పరిటాల రవి చేసిన హత్యల వెనక ఎన్టీఆర్ పాత్ర ఉందనే విధంగా సినిమాలో వర్మ చిత్రించడాన్ని వారు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఎన్టీ రామారావును కించపరచారని అంటున్నారు. వర్మ సినిమాపై ఆందోళనకు సిద్ధపడుతామని అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు. పరిటాల రవిని కూడా నెగిటివ్ గా చూపించారని మండిపడుతున్నారు. వర్మ తెలుగుదేశం పార్టీకి నష్టం చేసే విధంగా సినిమా తీశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కాగా, మీడియాపై కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడుతున్నారు. రాజేంద్ర ప్రసాద్, వల్లభనేని వంశీ వంటి తెలుగుదేశం నాయకులు వర్మకు మీడియా విశేషంగా ప్రచారం కల్పించడాన్ని తప్పు పట్టారు. వర్మను మేధావిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వర్మ సైకో అని వంశీ అన్నారు. మీడియా ఇంటర్వ్యూల్లో కాలు మీద కాలేసుకుని నిర్లక్ష్యంగా వర్మ వ్యవహరించారని, రక్తచరిత్రకు అనవసరమైన ప్రచారం కల్పించారని దుమ్మెత్తి పోస్తున్నారు. ముంబైలో తీవ్రంగా అప్పుల పాలై రక్తచరిత్రతో తెలుగు సినిమా రంగంలోకి మళ్లీ వచ్చారని అంటున్నారు.
ప్రస్తుత స్థితిలో వర్మ రక్తచరిత్ర సినిమాకు రాజకీయ కష్టాలు మొదలయ్యే ప్రమాదం ఉంది. నిజానికి, తన తండ్రి ప్రధాన పాత్రగా పరిటాల రవి శ్రీరాములయ్య చిత్రం తీశారు. ఆ సినిమా విశేషంగా నడిచింది. ఆ పాత్రనే రక్తచరిత్ర మొదటి భాగంలో వస్తోంది. అది వాస్తవిక కల్పిత గాధగా మనకు కనిపిస్తుంది. కానీ, రక్తచరిత్రలో సృజనాత్మక కల్పన మరుగునపడిపోయి వక్రీకరణ జరిగిందనేది ప్రధాన అభిప్రాయంగా కనిపిస్తోంది. గాయం సినిమా కూడా విజయవాడ రాజకీయాలను ప్రధానం చేసుకుని నడుస్తుంది. అందులోనూ కల్పన ఉంది. సినిమా చివరికి వచ్చే సరికి ఆ సినిమాలో కూడా వక్రీకరణ జరిగింది. వక్రీకరణకు కల్పనకు మధ్య తేడాను గుర్తించకపోవడంతో వర్మ చిక్కుల్లో పడినట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications