ఇప్పటి దాకా చిరంజీవికి దక్కింది ఒకటే!

Chiranjeevi
ఇటీవల తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించిన చిరంజీవి కాంగ్రెసు పార్టీ విలీనం ద్వారా అంతగా లాభం పొందిన దాఖలాలు కనిపించడం లేదు. రాష్ట్రంలో అత్యంత ప్రజాధరణ కలిగిన చిరంజీవి తన పార్టీని భేషరతుగా కాంగ్రెసు పార్టీలో విలీనం చేస్తున్నట్టు ఢిల్లీ వేదికగా ప్రకటించారు. చిరంజీవి ప్రకటించిన నాటి నుండి ఇప్పటి వరకు ఆ పార్టీకి ఒనగూరిన లాభం పెద్దగా లేదనే చెప్పవచ్చు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఈ ఆరేడు నెలల కాలంలో ప్రజారాజ్యం పార్టీకి దక్కినది ఏదైనా ఉందా అంటే అది సి.రామచంద్రయ్యకు శాసనమండలి సభ్యత్వం మాత్రమే. అంతకుమించి కాంగ్రెసు నుండి చిరంజీవి లాభపడిన దాఖలాలు ఏవీ లేవనే చెప్పవచ్చు. విలీనం ప్రకటన తర్వాత మొదట అందరూ చిరంజీవి పదవిపైనే చర్చించారు. 2014 ఎన్నికల నాటికి చిరంజీవి కాంగ్రెసు పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎదగటం మాత్రమే కాకుండా ఆయన వెంటనే పార్టీలో మంచి పదవి ఇస్తారని భావించారు. డి.శ్రీనివాస్ తర్వాత ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడి బాధ్యతలు చిరంజీవికి కట్టబెడతారని పలువురు భావించారు. అయితే చిరు సమైక్యవాది కావడం, రాజకీయాలు పూర్తిగా ఒంటబట్టక పోవడం ముఖ్యంగా పార్టీ విలీనం శాస్త్రీయంగా పూర్తి కాకపోవడం తదితర కారణాల వల్ల బొత్స సత్యనారాయణను ఆ పదవి వరించింది. అసలు చిరంజీవి పేరు బయట వినిపించడమే కానీ ఏ సమయంలోని పిసిసి చీప్ పదవికి అధిష్టానం పరిగణలోకి తీసుకోలేదనే చెప్పవచ్చు. ఆ తర్వాత మహారాష్ట్ర నుండి రాజ్యసభకు పంపిస్తారనే వార్తలు వచ్చాయి.

తెలంగాణ కోసం కె కేశవరావు రాజీనామా చేసిన స్థానంలో ఆయన రాజీనామాను ఆమోదించి చిరంజీవిని ఎంపిగా పంపిస్తారనే వార్తలు సైతం వచ్చాయి. అయితే అవన్నీ తేలిపోయాయి. మరో సంవత్సరం వరకు చిరంజీవి ఆగాల్సిందే అని తెలుస్తోంది. చిరును ఏఐసిసిలోకి గానీ, సిడబ్లుసిలోకి గానీ తీసుకుంటారనే వార్తలు సైతం అప్పుడప్పుడు వినిపిస్తున్నా అవి మాటల వరకే పరిమితం అవుతున్నాయి. సాక్షాత్తూ పిఆర్పీ అధినేత చిరంజీవి పరిస్థితే ఇలా ఉంటే ఇక మిగిలిన వారి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. సి.రామచంద్రయ్యకు ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత కోటగిరి విద్యాధర రావుకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఇప్పించడానికి చిరు ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదని తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోకి ఇద్దరు పిఆర్పీ ఎమ్మెల్యేలను తీసుకోవాలని భావించినప్పటికీ తెలంగాణ ప్రజా ప్రతినిధుల రాజీనామాలు, తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమాల కారణంగా మంత్రివర్గాన్ని ఇప్పుడు టచ్ చేసే పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదు. అంతేకాదు పిఆర్పీ సీనియర్ నాయకులు అయిన వేదవ్యాస్, డిటి నాయక్, కొత్తపల్లి సుబ్బారాయుడి వంటి సీనియర్ నేతల భవిష్యత్తు పైనే సందిగ్ధత తొలగలేదు. దీంతో ద్వితీయ శ్రేణి నాయకుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో పార్టీ విలీనంపై స్థానికంగా తీర్మానం చేసిన సమయంలో పార్టీ నేతలు కాంగ్రెసులో విలీనం అయితే కలిగే ప్రయోజనాలు అక్కడి నాయకత్వానికి హామీ ఇచ్చారు.

కానీ అంతా పూర్తయ్యాక ఇప్పుడు వారు పరిస్థితి అగమ్య గోచరంగా తయారయింది. కాంగ్రెసు పార్టీ నేతలు స్థానికంగా తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని పీఆర్పీ నేతలు పలుమార్లు అధినేతతో మొరపెట్టుకున్నారు. గతంలో చిరు సీమాంధ్ర పర్యటనకు వెళ్లినప్పుడు చిరు వద్దకు పిఆర్పీ నేతలను కాంగ్రెసు నేతలే అడ్డుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు కేవలం ఎమ్మెల్యేల ఉత్సాహం కారణంగా వారి ప్రతిపాదనల మేరకు బేషరతుగా పార్టీని విలీనం చేశారు. ఇలా అయితే భవిష్యత్తులో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి చిరంజీవికి ఓ జట్టు ఎలా తయారవుతోందని పీఆర్పీ ద్వితీయ శ్రేణి ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. వీలీనం తర్వాత భవిష్యత్తు తేల్చుకోలేక పదవులు లేక స్థానిక పిఆర్పీ నాయకత్వం సైతం పూర్తి నిస్తేజంగా కనిపిస్తోంది. చిరంజీవి సైతం తన భవిష్యత్తు, తన పార్టీ నేతల భవిష్యత్తుపై పూర్తి సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నందునే ఆయన బయటకు వచ్చి పార్టీలో ఉత్సాహం నింపలేక పోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే కడప ఉప ఎన్నికల తర్వాత చిరంజీవి రాష్ట్రంలో పర్యటించిన దాఖలాలు అంతగా లేవని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+