జగన్ పార్టీలోకి మరింత మంది ఎంపీలు?

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి చైర్మన్ పదవి దక్కకపోవడంతో రాయపాటి సాంబశివరావు బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీలో ఉఁడాలో లేదో తన నియోజకవర్గం కార్యకర్తలే తేలుస్తారని ఆయన చెప్పారు. అలా పదవులు ఆశిస్తున్నవారు కాంగ్రెసు పార్టీలో చాలా మందే ఉన్నారు. కావూరి సాంబశివ రావు, లగడపాటి రాజగోపాల్ కేంద్ర మంత్రి పదవులు ఆశించారు. కానీ వారికి ఆ అవకాశం దక్కే పరిస్థితి లేదు. పైగా, ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం ముమ్మరంగా సాగింది.
కాంగ్రెసు పార్టీలోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి వర్గంలో దగ్గుబాటి పురంధేశ్వరి ఉండడంతో అదే సామాజిక వర్గానికి చెందిన మరో పార్లమెంటు సభ్యుడికి మంత్రి పదవి దక్కే అవకాశాలు లేవు. దీంతో తమకు ఎలాగూ మంత్రి పదవులు దక్కవనే నిర్ణయానికి కావూరి సాంబశివ రావు, రాయపాటి సాంబశివ రావు వచ్చినట్లు చెబుతున్నారు.
మరో వైపు, రాష్ట్ర కాంగ్రెసులో కాపుల ప్రాబల్యం పెరుగుతోంది. చిరంజీవి, బొత్స సత్యనారాయణ వంటి నాయకులు రాష్ట్రంలో కాంగ్రెసు భవిష్యత్తును నిర్ణయించడానికి సిద్ధపడ్డారు. సీమాంధ్రలో కాపు, కమ్మ సామాజిక వర్గాల మధ్య వైరం నడుస్తూ ఉంటుంది. ఈ స్థితిలో సరైన ప్రాతినిధ్యం లభించని సామాజిక వర్గం జగన్ పార్టీ వైపు చూసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications