జగన్ పద్మవ్యూహంలో అభిమన్యుడా?

రాజకీయాలు, వ్యాపార రంగాలకు సంబంధించి వైయస్ జగన్ రాష్ట్ర రాజకీయాల్లో అసమాన ప్రతిభావంతుడనే పేరు సంపాదించుకున్నారు. అనతి కాలంలోనే ఆయన బడా పారిశ్రామికవేత్తగా, రాష్ట్రంలోని ముఖ్యమైన నేతగా ఎదిగారు. ఆయన చుట్టూ బలమైన కోటరీ కూడా ఏర్పడింది. వైయస్సార్ అనుచరులను, అభిమానులను తన వెంట పెట్టుకుని ఆయన రాష్ట్ర రాజకీయ పద్మవ్యూహాన్ని ఛేదించి అధికారాన్ని కైవసం చేసుకోవడానికి పూనుకున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పేరిట పార్టీని కూడా ఏర్పాటు చేశారు.
తన రాజకీయాల కోసం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. తన సాక్షి మీడియా ద్వారా సోనియా గాంధీనే కాదు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని, తెలుగు మీడియా టైకూన్ రామోజీరావును టార్గెట్ చేసుకున్నారు. తనపై వస్తున్న సవాలక్ష ఆరోపణలకు జగన్ నేరుగా సమాధానం ఇవ్వకుండా సాక్షి మీడియాను వాహకంగా ఎంచుకున్నారు. ఆయన అనుచరులు అంబటి రాంబాబు, శ్రీకాంత్ రెడ్డి వంటి శాసనసభ్యులు ప్రత్యర్థులపై ఎదురుదాడికి దిగుతున్నారు.
రాజకీయాధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న వైయస్ జగన్‌ను ప్రత్యర్థులు చుట్టుముట్టి దాడులు చేస్తున్నారు. ఆయనను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేయడానికి పూనుకున్నారు. జగన్‌ను ఎదుర్కోవడానికి రాష్ట్రంలోని శక్తులన్నీ ఏకమయ్యాయా అని కూడా అనిపిస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు అధికార కాంగ్రెసు పార్టీలోని ముఖ్యమైన నాయకులు జగన్‌ను టార్గెట్ చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెరిపి లేకుండా జగన్‌పై ఆరోపణలు చేయిస్తున్నారు. వైయస్సార్ వారసత్వాన్ని అవినీతిమయంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ వైయస్సార్ వారసత్వాన్ని జగన్ స్వీకరించలేని స్థితిని కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
అవన్నీ ఒక ఎత్తు అయితే, వైయస్ జగన్ ఆర్థిక మూలాలను దెబ్బ తీసే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. జగన్ సంస్థలకు సంబంధించి ఇప్పటికే ఆదాయం పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. జగన్ అస్తులపై హైకోర్టులో విచారణ నడుస్తోంది. వీటి నుంచి బయటపడడం వైయస్ జగన్‌కు సాధ్యమవుతుందా అనేది ప్రశ్న. బయటపడుతామని వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకుడు అంబటి రాంబాబు అంటున్నారు. ఈ స్థితిలో సమస్యలను అధిగమించి, ప్రత్యర్థులను ఎదుర్కుని వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలనే తన లక్ష్యాన్ని సాధిస్తారా అనేది పెద్ద ప్రశ్నగానే మిగిలింది.