జగన్ కట్టడికి జైపాల్ తెలంగాణ పోరు!

Jaipal Reddy-Ys Jagan
కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్ రెడ్డి త్వరలో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మంత్రివర్గం నుండి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణపై కేంద్రం స్పష్టమైన నిర్ణయం తీసుకోకుంటే కొద్దిరోజుల్లో మంత్రివర్గం నుండి బయటకు వచ్చి తెలంగాణ కోసం పోరాటం చేయాలనే భావనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే జైపాల్ రెడ్డి 2014 ఎన్నికలలో పోటీ చేయనని ప్రకటించారు.

అయితే వచ్చే ఎన్నికలలోగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా కేంద్రం చర్యలు కొనసాగేలా చెయ్యాలనే గట్టి ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి ఆసక్తి లేకున్నప్పటికీ కేవలం తెలంగాణ లక్ష్య సాధనే భాగంగా ఆయన కేబినెట్ నుండి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయంగా చివరి దశలో ఉన్న తాను తెలంగాణ కోసం పోరాటం చేయకుండా మంత్రిపదవిలో కొనసాగితే తెలంగాణ ప్రజల దృష్టిలో పలుచన అయ్యే ప్రమాదముందనే ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే జైపాల్ రెడ్డి ఈ నిర్ణయం పలువురిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

తెలంగాణ కోసం మంత్రివర్గం నుండి బయటకు రావాలనే నిర్ణయం జైపాల్ రెడ్డిది కాదనే మరో వాదన కూడా వినిపిస్తోంది. ఇటీవలే కాంగ్రెసు పార్టీ నుండి బయటకు వెళ్లి సొంత కుంపటి పెట్టుకున్న దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ పెట్టారు. జగన్ తన పార్టీని తెలంగాణకు చాపకింద నీరులా తీసుకు వస్తున్నారని ఇప్పటికే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెసు పార్టీని బతికించాలంటే కేంద్ర స్థాయిలో పలుకు బడి ఉన్న స్థానిక నేత అయిన జైపాల్ రెడ్డిని తెలంగాణ కోసం ఉద్యమింప జేసేందుకు తెలంగాణ ప్రాంతానికి చెందిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానారెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు తదితరులు ఒత్తిడి తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. గతంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన పేరు పలుమార్లు బయటకు వచ్చినప్పటికీ ఆయన ఆసక్తి చూపలేదు. రోశయ్య ముఖ్యమంత్రి పీఠం నుండి దిగిన సమయంలో కూడా అధిష్టానం మొదట జైపాల్ రెడ్డివైపే మొగ్గు చూపింది. అయితే ఉద్యమంలో పాలు పంచుకోకుండా సిఎం పదవి కోసం తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చాడన్న అపవాదు వస్తుందనే ఉద్దేశ్యంతో ఆయన అందుకు ససేమీరా అనడంతో కిరణ్ కుమర్ రెడ్డి పీఠంపై కూర్చున్నారు.

జగన్ పార్టీ తెలంగాణలో చాపకింద నీరులా ప్రవేశిస్తున్న నేపథ్యంలో సామాజిక సమీకరణలో భాగంగా కాంగ్రెసును నిలబెట్టడం కోసం జైపాల్ రెడ్డి తెలంగాణం ఎత్తుకునేందుకు మంత్రివర్గం నుండి బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు టిడిపి నుండి సస్పెండ్ అయిన నాగం జనార్దన్ రెడ్డి కూడా జైపాల్ రెడ్డి పంచన చేరే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో తన పార్టీని ప్రవేశింప చేసే ఉద్దేశ్యంలో భాగంగా జగన్ కాంగ్రెసు నేత జీవన్ రెడ్డి తనయుడి విందుకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా విందు సాయంత్రం సమయంలో ఉంటుంది. కానీ జీవన్ రెడ్డి తనయుడి విందు మధ్యాహ్నం సమయంలో ఉంది. దీంతో జగన్‌కు పలువురు నేతలతో మాట్లాడేందుకు కూడా అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు. జైపాల్ రెడ్డి, జానారెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, పి నర్సారెడ్డి, పాల్వాయి గోవర్దన్ రెడ్డి, టి పురుషోత్తం రెడ్డి, కేశవరావు, వి హనుమంతరావులకు ప్రత్యామ్నాయంగా తెలంగాణలో జగన్ పార్టీ ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

జగన్ తమకు ప్రత్యామ్నాయం కాకముందే కేబినెట్ నుండి బయటకు వచ్చి తెలంగాణ కోసం ఉద్యమిస్తే జగన్ పార్టీని తెలంగాణలో ప్రవేశించకుండా చేయవచ్చని వారు భావిస్తున్నారు. అయితే గతంలో కాంగ్రెసును వదిలి జనతా పార్టీలో చేరినప్పుడు ఆయన మానాన ఆయనను కాంగ్రెసు వదిలేసినట్లుగానే ఇప్పుడు కూడా కేబినెట్ నుండి బయటకు వెళ్ళి తెలంగాణ కోసం పోరాటం అంటూ పాట పాడితే మరోసారి ఆయన మానాన ఆయనను వదిలేసే అవకాశం కూడా ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+