జగన్ తెలంగాణ మద్దతు పొందుతారా?

మొదట తాను తెలంగాణకు వ్యతిరేకిని కాదని చెప్పుకోవడానికి తన వ్యూహం పనికి వస్తుందని ఆయన భావిస్తున్నారు. తద్వారా తెరాస మద్దతు సంపాదించడానికి కూడా వీలవుతుంది. అవసరమైతే సాధారణ ఎన్నికల్లో కెసిఆర్‌తో పొత్తు పెట్టుకోవడానికి ఇప్పటి వ్యూహం పనికి వస్తుంది. కెసిఆర్‌కు, జగన్‌కు మధ్య రహస్య అవగాహన ఇప్పటికే ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే, ఆ అవగాహనను వచ్చే ఎన్నికల నాటికి అధికారికంగా ప్రకటించడానికి ప్రస్తుత వ్యూహం పనికి వస్తుంది. తెలంగాణ ఉప ఎన్నికల తర్వాత వచ్చే మరో విడత ఉప ఎన్నికల్లో తెలంగాణ నియోజకవర్గాల్లో పోటీ చేసే కొండా సురేఖ వంటివారిపై తెరాస పోటీకి దించకుండా చూసుకోవడానికి ప్రస్తుత వ్యూహం పనికి వస్తుంది. కొండా సురేఖ తాను తెలంగాణ కోసమే రాజీనామా చేశానని చెబుతున్నారు కాబట్టి ఆ కారణంగా తెరాస ఆమెకు మద్దతు ప్రకటించడానికి వీలవుతుంది.
విప్‌ను ధిక్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసిన 18 మందిపై ఇప్పుడిప్పుడే స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనర్హత వేటు వేసే అవకాశాలు లేవని, తెలంగాణ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయిన తర్వాతనే అనర్హత వేటు పడి రెండో విడత ఆ స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చే విధంగా కాంగ్రెసు వ్యవహరిస్తోందనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెసు వ్యూహాన్ని దెబ్బ తీయడానికి ఇప్పుడు తెలంగాణ నియోజకవర్గాల్లో పోటీకి తమ పార్టీ అభ్యర్థులను పోటీకి దింపకపోవడమే మంచిదని జగన్ భావించినట్లు చెబుతున్నారు. అదే సమయంలో పోటీ చేసి ఓడిపోవడం కన్నా తెలంగాణ నియోజకవర్గాల్లో పోటీకి దిగకపోవడం వల్ల ఈ ప్రాంత ప్రజల సానుభూతిని పొందడానికి, రాజకీయంగా తెరాస మద్దతు సంపాదించుకోవడానికి, తాను తెలంగాణలో పర్యటించడానికి వీలవుతుందని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ రకంగా తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్లు ఉప ఎన్నికల ద్వారా సంకేతాలు పంపుతున్న వైయస్ జగన్ ఈ ప్రాంత ప్రజల సానుభూతి ఏ మేరకు పొందుతారనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications