• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నెల రోజుల్లో ఎమ్మెల్యేలపై వేటు, జగన్ అరెస్టు?

By Srinivas
|

YS Jagan
ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఇక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులపై అనర్హత వేటు ఎప్పుడన్న చర్చ కాంగ్రెసు వర్గాల్లో జోరుగా నడుస్తోంది. ఇప్పుడు జరిగే ఏడు నియోజకవర్గాల ఎన్నికల కంటే జగన్ వర్గంపై అనర్హత వేటు పడితే అప్పుడు జరిగే 17 నియోజకవర్గాల ఉప ఎన్నికలపైనే అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. జగన్ వర్గంపై వేటు తథ్యమని నేతలంతా అంటూ అందుకు వేరువేరు సమయాలు, వేరువేరు కారణాలు చెబుతున్నారని సమాచారం. కానీ సీనియర్లు మాత్రం మార్చి మొదటివారంలోనే ఈ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడి తీరుతుందని చెబుతున్నారట. ఎన్నికల షెడ్యూలు విడుదలైనా నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాతే జగన్ వర్గం ఎమ్మెల్యేలు 17 మందిపై వేటు పడే అవకాశం ఉందని అంటున్నారు. ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించినా ఖాళీల గురించి ఎన్నికల సంఘానికి సమాచారం అందించేందుకు 15 రోజుల సమయం ఉంటుందని కూడా చెబుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జగన్‌ ఎమ్మెల్యేలపై వ్యూహాత్మకంగా చర్యలు ఉంటాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ రెండో తేదీ నాటికి రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల ప్రక్రియ పూర్తికావాలి. యాదృచ్ఛికంగా అదే తేదీ నాటికి జగన్ అక్రమాస్తుల కేసుపై న్యాయస్థానంలో సిబిఐ అధికారులు చార్జిషీటును దాఖలు చేయాల్సి ఉంది. మార్చి రెండో వారంలోనో మూడో వారంలోనో రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది.

ఆ లోగా జగన్ వర్గ ఎమ్మెల్యేలపై వేటు పడొచ్చని కొందరు భావిస్తున్నట్లుగా సమాచారం. రాజ్యసభ ఎన్నికలు జరిగే నాటికి కూడా జగన్ వర్గం వారు ఎమ్మెల్యేలుగానే కొనసాగితే అనవసరమైన కష్టనష్టాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుందని, ప్రస్తుతం పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మతో కలిసి పద్దెనిమిది మందిగా ఉన్న జగన్ వర్గ ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో వేరే పార్టీకి సహకరించినా లేదా వారే ఎవరినైనా రాజ్యసభ సభ్యత్వానికి ప్రతిపాదించినా అదో పెద్ద సమస్యగా మారుతుందని కాంగ్రెసు భావిస్తోంది. అందువల్ల రాజ్యసభ ఎన్నికల్లోగా వారిపై వేటు వేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఇదే సమయంలో ఏప్రిల్ రెండో తేదీలోగా న్యాయస్థానంలో జగన్ అక్రమాస్తులకు సంబంధించి సిబిఐ చార్జ్‌షీట్‌ను దాఖలు చేయాల్సి ఉంది. దీంతో ఈ లోపు ఏ క్షణంలోనైనా జగన్‌ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారని సమాచారం. మార్చి మొదటి వారంలోనే యువనేత అరెస్టవుతారని కొందరు అంచనా వేస్తున్నారట.

ఒకవేళ జగన్ అరెస్టు అయి సానుభూతి పవనాలు ఏర్పడినా, అవి ఉప ఎన్నికలపై పడకుండా చూసుకోవాలన్న అభిప్రాయం నాయకుల్లో వ్యక్తమవుతోంది. మార్చిలోనే జగన్‌ను అరెస్టు చేసినా అదే నెలలో కాస్త అటు ఇటుగా ఆయన వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలు జరిగేందుకు ఆగస్టు వరకూ సమయం ఉంటుందని కాంగ్రెసు వర్గాలు అంచనా వేస్తున్నాయని తెలుస్తోంది. సిబిఐ అభియోగ పత్రం ద్వారా వెలుగులోకి వచ్చే అక్రమాస్తులు, అవకతవకలు, అధికార దుర్వినియోగం గురించి ప్రజల్లోకి బాగా వెళుతుందని వీరు భావిస్తున్నారట. జగన్ జైలుకు వెళ్లిన పక్షంలో ప్రజల ఆలోచనల్లో మార్పు వస్తుందని నెలలు గడిచే కొద్దీ సానుభూతి పూర్తిగా కరిగిపోతుందని వారు అనుకుంటున్నారని సమాచారం. అవినీతి ప్రధానంశంగా ప్రజల్లోకి వెళితే పార్టీకి విజయావకాశాలు మెరుగు పడతాయని వారు భావిస్తున్నారని తెలుస్తోంది.

English summary
Speaker Nadendla Manohar may take action on YSR Congress Party chief YS Jaganmohan Reddy camp mlas in March.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X