తెలంగాణ, బైపోల్స్: బొత్స పైన భారం

Botsa Satyanarayana
తెలంగాణ అంశంపై ఆ ప్రాంత సొంత పార్టీ ఎంపీలు నిత్యం సభను స్తంభింప చేస్తుండటం కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. పార్టీ నేతలు ఎవరు చెప్పినా వారు వినకుండా సభలో తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేస్తూ ప్రతిపక్ష పార్టీల కంటే ఎక్కువగా పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వైపు చూస్తోంది.

అదే సమయంలో ఉప ఎన్నికలలో సహకరించేందుకు పార్టీ నేతలు వెనుకాడుతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి బొత్స సహాయ సహకారాలు తీసుకోవాలని నిర్ణయించింది. దీంతో ఇది సత్తిబాబు సత్తాకు పరీక్షగా మారిందని చెప్పవచ్చు. తెలంగాణ ఎంపీలకు ఎలాగైనా నచ్చజెప్పాల్సిందిగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వయంగా చెప్పడంతో బొత్సతో పాటు కాంగ్రెస్ పెద్దలు వయలార్ రవి, గులాంనబీ ఆజాద్ రంగంలోకి దిగారు.

బొత్స సత్తిబాబు తెలంగాణకు వ్యతిరేకంగా లేకపోవడం వారిని కన్వీన్స్ చేయడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారని తెలుస్తోంది. బొత్స పిసిసి అధ్యక్షుడుగా ఎన్నకైన సమయంలోనూ పలువురు తెలంగాణవాదులు హర్షం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణకు అనుకూలంగా ఉన్న బొత్స ఎంపిక కాంగ్రెస్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందనేందుకు నిదర్శనమని వారు చెప్పారు.

బుధవారం ఉదయం రవితో కలిసి కెకె ఇంట్లో తెలంగాణ ఎంపీలతో బొత్స చర్చలు జరిపారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తెలంగాణపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదని, ఉప ఎన్నికలు, రాష్ట్రపతి ఎన్నికలయ్యేంత వరకూ వేచి చూడాలని వారికి నచ్చజెప్పినట్లు తెలిసింది. అయితే ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన కావాలని, అప్పుడే తాము వెనక్కి తగ్గడానికి వీలవుతుందని ఎంపీలు గట్టిగా చెప్పారు. దీనిపై మరింత చర్చించాలని అందరూ నిర్ణయించారు.

అదే సమయంలో ఉప ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తి కావడంతో పార్టీ విజయావకాశాలపై పార్టీ ఎంపీలతో సత్తిబాబు చర్చలు సాగించారు. కేంద్ర మంత్రులు పురందేశ్వరి, పళ్లంరాజు, పనబాక లక్ష్మి, ఎంపిలు కెవిపి రామచందర్ రావు, సాయి ప్రతాప్. చిరంజీవి, కెఎస్ రావు, రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, హర్ష కుమార్, జెడి శీలం, అనంత వెంకట రెడ్డి, చింతామోహన్ తదితరులతో వేర్వేరుగా, కలిసికట్టుగా చర్చించారు.

వైయస్సార్ కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అగమ్య గోచర స్థితిలో పడుతుందని, అందరూ కలిసి పార్టీని గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేయాలని బొత్స వారిని కోరారని సమాచారం. సగానికి పైగా సీట్లు గెలిచే అవకాశాలున్నాయని ఎంపీలతో జరిపిన సమీక్షలో ఆయన తేల్చారట. అయితే ఎంపిక చేసిన అభ్యర్థుల విషయంలో కొందరు ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. దీంతో ఒకరిద్దరిని మార్చే అవకాశాలున్నాయని బొత్స చెప్పారట.

పార్టీ తరఫున తీవ్రంగా కృషి చేస్తానని, అందరినీ కలుపుకొనిపోతానని, అయితే ఓటమికి మాత్రం తనను బాధ్యుణ్ని చేయొద్దని ఢిల్లీ పెద్దలను బొత్స కోరినట్లు సమాచారం. ఆజాద్‌కు ఇదే విషయం చెప్పారు. బుధవారం పార్లమెంట్ లాబీలో సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ను కూడా కలిశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+