జూ.ఎన్టీఆర్ టు జగన్: లోకేష్‌కు సవాళ్లు(పిక్చర్స్)
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ సైలెంట్‌గా రాజకీయ ఆరంగేట్రం చేశారు. చంద్రబాబు తర్వాత పార్టీ పగ్గాలు నారా లోకేష్‌కే అనే విషయం ఇప్పటికే టిడిపి క్యాడర్‌తో సహా అందరికీ అర్థమైంది. ఇటీవల పలు జిల్లాల్లో పర్యటించిన లోకేష్ పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా నియోజకవర్గ కార్యకర్తలతో వరుసగా భేటీ అవుతూ పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తూ బలోపేతం గురించి ఉద్బోద చేస్తున్నారు.
నారా లోకేష్ ముందు ఎన్నో సవాళ్లు?
2014 ఎన్నికల్లో చంద్రబాబు పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు పాదయాత్రను ప్రారంభించారు. ఆయన నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. అదే సమయంలో లోకేష్ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. కార్యకర్తల్లో, నాయకుల్లో ఉత్సాహం నింపేందుకు కృషి చేస్తున్నారు. చంద్రబాబు పాదయాత్రతో ప్రజల్లో విశ్వాసం, కేడర్లో ఉత్సాహం నింపుతున్నప్పటికీ భవిష్యత్తులో పార్టీ పగ్గాలు చేపట్టబోయే లోకేష్ ముందు కూడా ఇప్పటికిప్పుడు ఎన్నో సవాళ్లున్నాయనే చెప్పవచ్చు.
పార్టీపై పట్టు కోసం కుటుంబంలో చెలరేగుతున్న సెగను చల్లార్చడం, వరుసగా రెండుసార్లు అధికారానికి దూరమైన కేడర్‌లో పట్టుదల, విశ్వాసం పెంపొందించడం, ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవడం, రాజకీయాల్లో ఇంకా అనుభవం సంపాదించడం వంటివి లోకేష్ ముందున్నాయి. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు లోకేష్‌కు ఇంకా చాలా సమయం ఉంది. కాబట్టి ఇంతలో అతను తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది.
లోకేష్ ట్విట్టర్ పోస్టులలో హీటెక్కించడమే కాకుండా ప్రజలను ఆకర్షించే నేతగా ఎదగాలంటున్నారు. పగ్గాలు చేపట్టే సమయానికి అతను తనను తాను నిరూపించుకోవాలి. తండ్రి చాటు బిడ్డలా ఇంకా ఉండకుండా సామాన్యుల్లో ఒకడిగా కలిసిపోవాలి. ఎన్టీఆర్, చంద్రబాబులా నాయకుడు ప్రజల నుండి ఎదగాలి. ఎన్టీఆర్ ఇమేజ్, బాబు చాణక్యం కారణంగా టిడిపి ఇన్నాళ్లు నిలదొక్కుకుంది. ఈ రెండింటిని కలగలుపుకుంటేనే లోకేష్ పార్టీని విజయవంతంగా నిలపగలడంటున్నారు.
లోకేష్‌కు ఇప్పటి వరకు ఎలాంటి మాస్ ఇమేజ్ లేదు. ఆయన నిత్యం ప్రజల్లో ఉండి తన ఇమేజ్‌ను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ మనువడు, బాబు తనయుడు కావడంతో అతనిని టిడిపి ఆమోదిస్తుండవచ్చు. కానీ ప్రజలు ఆమోదించాలని లేదు కదా అంటున్నారు. ప్రజలను ఆకర్షించే శక్తి లోకేష్‌కు అవసరమంటున్నారు. అలాగే, పార్టీలో అలకలను తగ్గించడం కష్టసాధ్యమైన విషయమేనని, చాణక్యుడిగా పేరుపొందిన బాబుకే ఇందులో ఇబ్బందులు వస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. ఇందుకోసం లోకేష్‌కు మరింత రాజకీయ అనుభవం కావాలంటున్నారు.
జగన్‌కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న కేడర్
సీమాంధ్రలో టిడిపిని ఇబ్బందులకు గురి చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి లోకేష్ మంచి ప్రత్యామ్నాయం అని టిడిపి క్యాడర్ భావిస్తోంది. జగన్ యువకుడు కాబట్టి లోకేష్ వంటి యువనేత ద్వారానే ఆయనను ధీటుగా ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. జగన్ పార్టీ పెట్టక ముందు నుండే ఓదార్పు యాత్ర పేరుతో ప్రజల్లో తిరిగాడు. ఇప్పుడు జైలుకు వెళ్లినా పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు షర్మిల యాత్ర చేస్తున్నారు.
లోకేష్ ప్రస్తుతం పార్ట్ టైమ్ నేతగా ఉన్నా త్వరలో బస్సు యాత్ర చేపట్టి ఫుల్ టైమ్ లీడర్‌గా ఎదగాలని భావిస్తున్నారు. వారిలా నిత్యం ప్రజల్లో లోకేష్ ఉంటేనే ఎన్నికల్లో పార్టీకి ఉపయోగపడుతుందంటున్నారు. తెరాస అధ్యక్షుడు కెసిఆర్ తనయుడు కెటి రామారావు, అల్లుడు హరీష్ రావులు కూడా ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. జగన్, కెటిఆర్, హరీష్‌ల దూకుడు నిత్యం అందరూ గమనిస్తున్నారు. అలాంటి దూకుడు ఉంటేనే లోకేష్ నెగ్గుకు రాగలడని అంటున్నారు. దూసుకుపోయేతత్వం లోకేష్‌కు లేదని, ఆయన అలవర్చుకోవాల్సిన అవసరముందని అంటున్నారు.
జూనియర్‌ను ఎదుర్కొని నిలబడగలగాలి
భవిష్యత్తులో టిడిపి పగ్గాల కోసం లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య పోటా పోటీ నెలకొందనే ప్రచారం సాగుతోంది. జూ ఎన్టీఆర్‌కు మాస్ ఇమేజ్ ఉన్నా రాజకీయానుభవం లేదు. లోకేష్ ఇప్పుడు రాజకీయానుభవం సంపాదించుకుంటున్నా మాస్ ఇమేజ్ లేదు. ఆయనను పార్టీ ఆమోదిస్తోంది. కానీ నాయకుడికి మాస్ ఇమేజ్ అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో జూనియర్‌ను తట్టుకొని నిలబడటం లేదా అతనిని కలుపుకుపోయే శక్తి లోకేష్‌కు ఉండాలి. టిడిపి పగ్గాల కోసం ఎదురు చూస్తున్న లోకేష్... వారసత్వ రాజకీయాలు అని అని కాంగ్రెసు, ఇతర పార్టీలను విమర్శించే అవకాశం కోల్పోయారని అంటున్నారు.

బాబు చాణక్యం, ఎన్టీఆర్ ఇమేజ్ పార్టీని నిలబెడుతోంది. ఈ రెండు కలగలిస్తేనే లోకేష్ పార్టీని గట్టెక్కించగలడు.

ఓదార్పుతో జగన్, తెలంగాణవాదంతో కెటిఆర్, హరీష్ రావులు నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. లోకేష్ కూడా తండ్రిచాటుబిడ్డలా కాకుండా నిత్యం ప్రజల్లో ఉండాలని, పార్టీ ఆమోదించినంత మాత్రాన ప్రజలు ఆమోదించాలని లేదని, వారి మెప్పు కోసం ఆయన రోడ్డెక్కాల్సిందే అంటున్నారు.

పార్టీ పగ్గాలు చేపట్టేందుకు లోకేష్ మొదట ఇంటి పోరును దాటాల్సి ఉంది. పార్టీలోను అరమరికలను సరిచేయాల్సి ఉంటుంది.

ఇతర పార్టీల విషయానికి వస్తే టిడిపిని గట్టెక్కించేందుకు సీమాంధ్రలో జగన్, తెలంగాణలో కెటిఆర్, హరీష్ రావుల దూకుడును ధీటుగా ఎదుర్కోవాల్సి ఉంది. ట్విట్టర్‌లో రెచ్చిపోతున్న లోకేష్ బయట కూడా దూసుకుపోయేతత్వం అలవర్చుకోవాలని చెబుతున్నారు.

టిడిపి పగ్గాల కోసం చూస్తున్న లోకేష్ వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే హక్కు కోల్పోయాడని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications