తెలంగాణపై టెన్షన్: గ్రూపులు కడుతున్న నేతలు

ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తెలంగాణకు అనుకూలంగా నివేదిక ఇవ్వనున్నారు. బొత్స ఇచ్చే నివేదికపై మాత్రం సస్పెన్స్ నెలకొంది. ఇప్పుడికే వారు ముగ్గురు రోడ్ మ్యాప్‌లు తయారీ చేసే పనిలో బిజీ అయ్యారట. ఎవరేం ఇస్తారనే విషయం తెలిసినప్పటికీ కాంగ్రెసు పార్టీ ఇరు ప్రాంతాల నేతలు ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్, డిసిఎంలను కలిసి తమ తమ ప్రాంతాలకు అనుగుణంగా నివేదిక ఇవ్వాలని కోరుతున్నారు. తద్వారా రాష్ట్ర కాంగ్రెసు ఇప్పుడు ముక్కలుగా కనిపిస్తోంది.
సమైక్యాంధ్ర, తెలంగాణ, రాయల తెలంగాణలే కాకుండా విభజిస్తే మూడు రాష్ట్రాలుగా విభజించాలని కోరుతున్న వారు కూడా ఉన్నారు. అయితే మూడు రాష్ట్రాల విభజన కంటే మిగతా వాటి కోసం పలువురు నేతలు కలుస్తున్నారు. త్వరలో నిర్ణయం అని అధిష్ఠానం ఊరిస్తున్న తరుణంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చౌరస్తాలో నిలబడ్డారు. మూడు, నాలుగు శిబిరాలుగా విడిపోయారు. తెలంగాణ ఇవ్వాల్సిందే అంటూ తెలంగాణ కాంగ్రెసు నేతలు, వద్దని సీమాంధ్రకు చెందిన పలువురు నేతలు, రాయల తెలంగాణ ససేమీరా అని సీమ నాయకులు, మూడు ముక్కలని మరికొందరు, రాయల తెలంగాణే పరిష్కారమని ఇంకొందరు సీమ నేతలు చెబుతున్నారు.
సీమను విభజించవద్దంటూ పార్టీలకు అతీతంగా రాయలసీమ నాయకులు గళం కలుపుతున్నారు. అయితే సమైక్య రాష్ట్రం, లేదంటే సీమకు ప్రత్యేక రాష్ట్రం అనే డిమాండ్‌ను ప్రధానంగా వినిపిస్తున్నారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సాయి ప్రతాప్, ఏరాసు ప్రతాప రెడ్డి, బైరెడ్డి రాజశేఖర రెడ్డి తదితరులంతా ఒకటి కాదంటే మూడే అంటున్నారు. జెసి దివాకర్ రెడ్డి వంటి నేతలు మాత్రం నీటి వివాదాలు రాకుండా ఉండేందుకు రాయల తెలంగాణ మంచిదని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి నాలుగైదు రోజుల్లో తెలంగాణపై అధిష్టానం తేలుస్తుందా? తేల్చితే ఏం చెబుతుందన్న ఆందోళన అందరిలోను కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications