దారితప్పిన బొత్స!: సొంత ఇలాకాలో చిక్కేనా?

అధికార కాంగ్రెస్ పార్టీ కూడా వివిధ జెఎసిలకు మద్దతుగా నిలబడి ఉద్యమంలో చోటు దక్కించుకుంది. శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ప్రసాదరావు, శత్రుచర్ల విజయ రామారావు, విశాఖ జిల్లాలో గంటా శ్రీనివాస రావు తమ పదవులకు రాజీనామాలు చేసినట్టు ప్రకటించి, ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. మంత్రులు విశ్వరూప్, తోట నర్సింహం తదితరులంతా వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా రాజీనామా చేస్తారని, విభజనపై అసంతృప్తితో ఉన్నారంటూ ప్రచారం సాగుతోంది. ఇక కేంద్రమంత్రులు ఢిల్లీలో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పిసిసి అధ్యక్షునిగా ఉన్న బొత్స తన పదవికి రాజీనామా చేయకపోవడం, ఉద్యమం ఆరంభమై 20 రోజులవుతున్నా, కనీసం ఒక్కసారి కూడా విజయనగరం రాకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత రోజు రోజుకూ పెరుగుతోందని అంటున్నారు. అదే సమయంలో విభజన విషయంలో ఘాటుగా స్పందించకపోవడం ఆగ్రహానికి గురి చేస్తోందట.
గత పదేళ్ళుగా విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు. ఇప్పుడా పరిస్థితి రాష్ట్ర విభజన నిర్ణయంతో పరిస్థితులు తారుమారు అవుతున్నాయంటున్నారు. సీమాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు రాజీనామాలు చేసి ముఖ్యమంత్రిని కలిసి వచ్చిన సందర్భంలో బొత్సను కలిసిన ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ పదవిని వదులుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే అందుకు బొత్స ససేమిరా అన్నారట. దీంతో విశాఖ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆయనపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సమాచారం.
ఆయన భార్య బొత్స ఝాన్సీ కూడా పదవికి రాజీనామా చేయకపోవడం పట్ల స్వపక్షీయులు, ప్రజలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. బొత్స సోదరుడు అప్పలనరసయ్య గజపతినగరం ఎమ్మెల్యేగా, మేనల్లుడు అప్పలనాయుడు నెల్లిమర్ల నుంచి ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారు. వీరు రాజీనామాలు చేసినట్టు ప్రకటించినా, స్పీకర్ ఫార్మాట్‌లో ఇవ్వలేదంటూ టిడిపి నేత అశోక గజపతిరాజు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications