ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ఢోన్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పాణ్యం నియోజకవర్గం నుండి బేతంచర్ల పూర్తిగా ఢోన్ నియోజక వర్గంలో చేరింది. ఇద్దరు ముఖ్యమంత్రులు గెలిచిన నియోజకవర్గం ఢోన్. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పని చేసిన కోట్ల విజయ భాస్కర రెడ్డి, ఏపి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి ఇదే నియోజకవర్గం నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కెఇ కుటుంబం ఇక్కడి నుండి అత్యధిక సార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. 2009 వరకు కెఇ కృష్ణమూర్తి ఆయన సోదరుడు కెఇ ప్రభాకర్ ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేసేవారు. 2014 ఎన్నికల్లో కెఇ కృష్ణమూర్తి పత్తికొండ నుండి పోటీ చేసి గెలుపొందారు.
16 సార్లు ఎన్నికలు.. రెండు కుటుంబాల ఆధిపత్యం..
1952 లో ఏర్పాటైన ఢోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో ఎనిమిది సార్లు కాంగ్రెస్, నాలుగు సార్లు టిడిపి, మూడు సార్లు స్వతంత్ర అభ్యర్ధులు, ఒకసారి వైసిపి అభ్యర్ధి గెలుపొందారు. ఇక్కడి నుండి 1962 లో నీలం సంజీవరెడ్డి, 1994 లో కోట్ల విజయభాస్కర రెడ్డి గెలిచారు. కెఇ కృష్ణమూర్తి కాంగ్రెస్ నుండి మూడు సార్లు, టిడిపి నుండి రెండు సార్లు గెలుపొదారు. ఆయన సోదరుడు కెఇ ప్రభాకర్ ఢోన్ నుండి రెండు సార్లు టిడిపి ఎమ్మెల్యే గా గెలుపొందారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి కోడలు కోట్ల సుజాత 2004 లో కెఇ ప్రభాకర్ మీద గెలిచి..2009 లో కెఇ కృష్ణమూ ర్తి చేతిలో పరాజయం పాలయ్యారు. 2014 ఎన్నికల నాటికి ఇక్కడి రాజకీయ సమీకరణాలు మారిపోయాయి.

2014 లో వైసిపి అభ్యర్ధి గెలుపు..
ఢోన్ నియోజకవర్గం నుండి వైసిపి అభ్యర్ధిగా బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి పోటీ చేసారు. టిడిపి నుండి కెఇ సోదరుడు కెఇ ప్రతాప్ పోటీ చేసారు. ఈ నియోకవర్గంలో మొత్తం 227741 ఓట్లు ఉండగా, 166975 ఓట్లు పోలయ్యాయి. వైసిపి అభ్యర్ది బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డికి 83683 ఓట్లు రాగా, టిడిపి అభ్యర్ది కెఇ ప్రతాప్ కు 72531 ఓట్లు వచ్చాయి. వైసిపి అభ్యర్ధి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి 11152 ఓట్ల తేడాతో గెలుపొందారు. వైసిపి ప్రతిపక్షంలో ఉండటంతో తొలుత భూమా నాగిరెడ్డి పిఏసి చైర్మన్ గా వ్యవహరించారు. ఇదే జిల్లాకు చెందిన భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరటంతో..ఆయన స్థానంలో బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి పిఏసి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. శాసనసభలోనూ బయటా ప్రభుత్వ నిర్ణయాల పై సునిశిత విమర్శలు చేయటంలో వైసిపి నుండి బుగ్గన ముందుంటారు. ఇక, సభలోనూ కెఇ కృష్ణమూర్తి తో బుగ్గన అనేక సంద ర్బాల్లో వ్యంగాస్త్రాలు సంధించిన సందర్బాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications