అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం: రూపంపై తేడాలు
హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఉన్న మహత్మా గాంధీ విగ్రహం పక్కనే సోమవారం ఘనంగా ఆవిష్కరించారు. శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ చేతులమీదుగా విగ్రహ ఆవిష్కరణ జరిగింది. కాగా ఆ విగ్రహం అంబేద్కర్‌ను పోలి లేకపోవడంతో పలువురు సభ్యులు అసహనం వ్యక్తం చేశారు.
ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాసన సభ్యులు మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ.. విగ్రహం పెట్టాలనుకోవడం మంచిదే అని, అయితే అంబేద్కర్ విగ్రహం పెడితే బాగుండేదని చమత్కరించారు. విగ్రహానికి అంబేద్కర్ ముఖ కవళికలే లేవని ఆయన అన్నారు. ఈ విగ్రహాన్ని మార్చి అంబేద్కర్ రూపురేఖలు చక్కగా కనిపించే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మోత్కుపల్లి కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ఫిర్యాదు చేశారు.

మరో దళిత నేత పుష్పరాజ్ మాట్లాడుతూ.. విగ్రహం తయారైనప్పుడు బాగానే ఉందని, అసెంబ్లీకి తెచ్చాక బహుశా తాను రాసిన రాజ్యాంగాన్ని వక్రీకరిస్తున్న తీరుచూసి బాధతో ఆయన ముఖం అలా తయారై ఉంటుందని వ్యాఖ్యానించారు. దీనికి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
కాగా ఈ గొడవంతా ఎందుకని మహాత్మా గాంధీ విగ్రహం రోడ్డు వైపు ముఖం పెట్టి కళ్లు మూసుకున్నట్లు ఉందని మరో సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి చమత్కరించారు. ఇది ఇలా ఉండగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ అనంతరం అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు అంబేద్కర్ విగ్రహం ముందు ఫొటోలు దిగారు.












Click it and Unblock the Notifications