పొత్తుకు: కెసిఆర్‌తో డిగ్గీ రహస్య చర్చలు
హైదరాబాద్: తన పార్టీని విలీనం చేయబోనని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రకటించిన నేపథ్యంలో కనీసం పొత్తుకైనా ఒప్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచన మేరకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగారు. తెరాసను పూర్తిగా వ్యతిరేకిస్తూ వస్తున్న సీనియర్ నేత కె. జానారెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా నియమించకపోవడంలోని ఆంతర్యం కూడా అదేనని అంటున్నారు.
బిజెపి, తెలుగుదేశం పార్టీలు పొత్తు కుదుర్చుకుని రంగంలోకి దిగుతున్న నేపథ్యంలో తెరాసతో పొత్తు లేకుండా ముందుకు దూకితే ప్రమాదం ఉంటుందని కాంగ్రెసు అధిష్టానం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తెరాసతో పొత్తుకు గాను సోనియా గాంధీ కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. ఆ ప్రతిపాదనలను దిగ్విజయ్ సింగ్ కెసిఆర్ ముందు పెట్టినట్లు చెబుతున్నారు. వీరిరువురి మధ్య రహస్య చర్చలు సాగుతున్నాయని అంటున్నారు.

తెరాసపై దూకుడు ప్రదర్శించిన తెలంగాణ కాంగ్రెసు నేతలు, కాంగ్రెసుపై విమర్శలు ఎక్కుపెడుతూ వచ్చిన తెరాస నేతలు వెనక్కి తగ్గడంలోని ఆంతర్యం అదేనని అంటున్నారు. కాంగ్రెస్ విషయం లో ఆచితూచి వ్యవహరించాలని తెరాస అధినేత కేసీఆర్ శ్రేణులకు సూచించడంతో కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు సైతం ఆ పార్టీ నేతలకు ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలు స్తోంది. దీంతో రెండు రోజులుగా ఈ పార్టీల నేతలు పరస్పర వ్యాఖ్యలను ఆపేశారు.
దిగ్విజయ్‌సింగ్ హైదరాాబద్ చేరుకోవడంతో కాంగ్రెసు, తెరాస పార్టీల పొత్తులపై ఆశలు చిగురిస్తున్నాయి. బిజెపి, తెలుగుదేశం మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో తెరాసలోకి టిడిపి వలసలు ఆగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెసు తెరాసతో పొత్తు ఎంత అవసరమో, కాంగ్రెసుతో తెరాసకు పొత్తు అవసరమనే పరిస్థితి వచ్చింది. ఈ స్థితిలో తెరాస అధినేత కెసిఆర్ పొత్తుకు సానుకూలంగా ప్రతిపస్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నరాు.
గురువారం జరిగిన రహస్య భేటీలో కెసిఆర్, దిగ్విజయ్ తాజా రాజకీయ పరిణామాలపై సుధీర్ఘంగా చర్చలు జరిపినట్లు తెలిసింది. రెండు పార్టీల సంబంధాలపైనా వీరిరువురు చర్చించినట్లు తెలిసింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎఐసిసి అధినేత సోనియాగాంధీ సవాలుగా తీసుకొని రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని కెసిఆర్‌కు దిగ్విజయ్ వివరించినట్లు తెలుస్తోంది. విలీనం కాకున్నా పొత్తు అవసరమని సోనియా గాంధీ భావిస్తున్నారని దిగ్విజయ్ సింగ్ కెసిఆర్‌తో చెప్పినట్లు సమాచారం.
సోనియా చేసిన ప్రతిపాదనలను దిగ్విజయ్‌సింగ్ కెసిఆర్ ముందుంచినట్లు తెలుస్తోంది. దిగ్విజయ్ సింగ్ ఢిల్లీకి తిరిగి బయలుదేరే లోపల ఇరు పార్టీల మధ్య సంబంధాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications