హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి మీద నోరు పారేసుకున్నందుకు మహిళారాజ్యం అధ్యక్షురాలు శోభారాణిపై ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రజారాజ్యం కార్యాలయంలో మీడియా ఎదుట సబిత మీద శోభారాణి చేసిన విమర్శల సంగతి చిరంజీవి దృష్టికి వచ్చింది. పార్టీ ఏదైనా ఒక మహిళను దేశ చరిత్రలోనే ప్రధమంగా హోంమంత్రి పదవి వరిస్తే అభినందించాల్సింది పోయి ఆక్షేపించడమేమిటని చిరంజీవి మందలించినట్టు తెలుస్తోంది. అంతేగాక సబితా ఇంద్రారెడ్డిని కలిసి ప్రజారాజ్యం తరఫున అభినందనలు తెలిపి రావలసిందిగా చిరంజీవి తన పార్టీ నాయకురాలై వాసిరెడ్డి పద్మ నాయకత్వంలో ఒక ప్రతినిధి బృందాన్ని పంపారు. శోభారాణి వ్యాఖ్యలు పట్టించుకోవద్దని వారు సబితకు చెప్పినట్టు తెలుస్తోంది. అవి శోభారాణి వ్యక్తిగత అభిప్రాయాలే గానీ ప్రజారాజ్యం పార్టీ అభిప్రాయాలు కావని వారు వివరించారు. పార్టీ ఆఫీసులో చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమెలా అవుతాయని సబిత ప్రశ్నించినట్టు తెలిసింది. ఆమెకు ఎలాగోలా సర్దిచెప్పి ఆ తర్వాత చిరంజీవితో ఫోన్ లో మాట్లాడించారు. చిరు ఆమెను ఈ సందర్భంగా అభినందించారు.