తెలుగుదేశం నాయకురాలు కవిత తెలుగు మహిళ మాజీ అధ్యక్షురాలు రోజా దారిలో పయనించనున్నారా? పరిణామాలను పరిశీలిస్తుంటే అదే నిజం కావచ్చునని అనిపిస్తోంది. కవిత తెలుగు మహిళ అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆమె ఆశలను వమ్ము చేస్తూ సీతాదయాకర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగు మహిళ అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. కవితను కార్యనిర్వాహక కార్యదర్శిగా మాత్రమే నియమించారు. దీంతో తీవ్ర నిరాశకు గురైన కవిత ముఖ్యమంత్రి కె.రోశయ్యను కలుసుకున్నారు. తనకు ఏదైనా పదవి ఇస్తే పూర్తి కాలం రాజకీయాల్లో పని చేసి ఉండేదాన్ననని, ఇప్పుడు పార్ట్ టైమ్ రాజకీయాలే చేస్తానని కవిత అంటున్నారు. తెలుగు మహిళ అధ్యక్ష పదవి దక్కకపోవడంపై తన అసంతృప్తిని ఆమె చెప్పకనే చెప్పారు. తాను ఇక సినిమాలకు ఎక్కువ సమయం కేటాయించి, రాజకీయాలకు తక్కువ సమయం ఇస్తానని ఆమె చెప్పారు. తెలుగు మహిళ అధ్యక్ష పదవి మొదటి నుంచి కూడా చంద్రబాబుకు తలనొప్పిగానే ఉంది. సినీ గ్లామర్ ఉన్న మహిళలకు ఆ పదవి కట్టబెట్టడం, వారు పార్టీ ఫిరాయించడం సంప్రదాయంగా మారింది. శారద, జయప్రద, రోజా విషయాల్లో అదే జరిగింది. ఇప్పుడు కవితను ఆ పదవిలో నియమిస్తే అటువంటి పరిస్థితే ఎదురు కావచ్చునని భావించిన చంద్రబాబు సీతా దయాకర్ రెడ్డిని ఆ పదవికి ఎంపిక చేశారు. అయినా ముప్పు తప్పలేదు. కవిత రోజా దారి పట్టడానికే సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది.