సాక్షి టీవీ చానెల్ గత కొద్ది రోజులుగా వైయస్ జగన్ ప్రచారంతో ఊదరగొడుతోంది. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే ప్రచారానికే పూర్తిగా అంకితమైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జగన్ ను ముఖ్యమంత్రి చేయకపోతే రాజీనామాలు చేస్తామని చెప్పిన మంత్రుల ప్రకటనలకు, వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయకపోతే తేల్చుకుంటామని చెప్పే వారి మాటలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని అంటున్నారు. కాగా, పలువురు ప్రముఖులు జగన్ ను పరామర్శించి వెళ్తున్నారు. విషాద సమయంలో అలాంటి పరామర్శలు పరిపాటి. అయితే పనిలో పనిగా వచ్చిన పెద్దలు వైయస్ జగన్ ను ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటున్నట్లు సాక్షి టీవీ చానెల్, దినపత్రిక తన సొంత వ్యాఖ్యానాలు జోడించడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై చాలా మంది ఏమీ అనలేక లోలోపల బాధపడుతున్నట్లు సమాచారం. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని కోరేవారి ప్రకటనలు తీవ్ర స్థాయిలో ఉండడంతో వాటి క్లిప్పింగులు పార్టీ అధిష్ఠాన వర్గం చెంతకు చేరుతున్నట్లు చెబుతున్నారు. జగన్ కు మేలు చేయడానికి కంకణం కట్టుకున్న సొంత చానెల్ వల్ల మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే, జగన్ కోసం మాట్లాడితే సాక్షి చానెల్ లో ప్రచారం లభిస్తుండడంతో వరంగల్ తదితర ప్రాంతాల్లో పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం వంటి సంఘటనలకు పాల్పడినట్లు చెబుతున్నారు. ఇది డిఎస్ ను తీవ్రంగా మనస్తాపానికి గురి చేసినట్లు చెబుతున్నారు. అలాగే వి. హనుమంతరావు కూడా మనసు నొచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో జగన్ కు వ్యతిరేకంగా ఒక బలమైన లాబీ ఢిల్లీలో పని చేస్తున్నట్లు తెలుస్తోంది.