తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆశలు చిగురించినట్లేనని అంటున్నారు. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు చంద్రబాబు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును దెబ్బ తీయడానికి ఆయన గత కొద్ది రోజులుగా మూడు చెరువుల నీళ్లు తాగుతున్నారు. ఇప్పుడు గద్దర్ ప్రజా ఫ్రంట్ ఏర్పాటు కావడంతో తానేమీ చేయాల్సిన అవసరం లేదని, గద్దర్ ప్రజా ఫ్రంటే ఆ పని చేసి పెడుతుందని చంద్రబాబు సంబరపడిపోతున్నారట. గద్దర్ తన ఫ్రంట్ ను రాజకీయ ఫ్రంటే అంటున్నారు. అది కెసిఆర్ ను కూకటివేళ్లతో కాకపోయినా చాలా వరకు దెబ్బ తీస్తుందని ఆయన అంచనా వేస్తున్నారని సమాచారం. గద్దర్ రాక వల్ల తెలంగాణలో తమ పార్టీ క్యాడర్ ను కాపాడుకోవచ్చునని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. అందువల్ల గద్దర్ ను మనస్ఫూర్తిగా ఆహ్వానించేందుకు ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో గద్దర్ ఫ్రంట్ వెనక ఎవరున్నారంటూ ఆయన ఆరా తీశారు. గద్దర్ ఫ్రంట్ కూపీ లాగేందుకు ఆయన శ్రమిస్తున్నట్లు చెబుతున్నారు. ఏమైనా, తెలంగాణలో తిరిగి తమ పార్టీకి మంచి రోజులు వచ్చినట్లేనని ఆయన ఆనందపడిపోతున్నారని వినికిడి.