కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు నవ్వు తెప్పిస్తోందని అంటున్నారు. ఓదార్పు యాత్రను ఆయన ఎందుకు చేపట్టారో అందరికీ తెలిసిందే. ఈ ఓదార్పులో ఆయన బాధితులను పరామర్సిస్తున్న తీరు ఎబ్బెట్టుగా ఉందనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. బాధితులనే కాకుండా తనను కలవడానికి దగ్గరికి వచ్చినవారిని కూడా పరామర్శిస్తున్న తీరు నవ్వు తెప్పించేదిగా ఉందని తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు వ్యాఖ్యానించారు. ఆయన బాధితుల రెండు చెంపలు రెండు అరచేతులతో నిమురుతూ వారిని ఓదారుస్తున్నారు. అంతేకాదు, తలపై చేయి పెట్టి ఆశీర్వదించే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. ఒక రకంగా ఆయన నేనున్నానంటూ వారికి భరోసా ఇస్తున్నట్లు, వారిని కాపాడేవాడిని తాను మాత్రమేనన్నట్లు వ్యవహరిస్తున్నారని అంటున్నారు. జగన్ కు తాను అనుసరించే పద్ధతి ఎలా ఉన్నా, చూసేవారికి మాత్రం నవ్వు తెప్పిస్తోందని అంటున్నారు. అంటే, ఆయన ఓదార్పులో సీరియస్ నెస్ లోపించిందనే వ్యాఖ్య వినిపిస్తోంది. ప్రసంగాలు చేసే పద్ధతి కూడా పూర్తిగా తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిని అనుకరిస్తున్నట్లే ఉంది. అయితే, అది పూర్తిగా నప్పుతోందా, లేదా అనేది ఆయన చూసుకోవడం లేదని అంటున్నారు. ప్రజలకు ఎలా ఉన్నా, తన వర్గానికి మాత్రం జగన్ రక్షకుడేనట.