ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తిరస్కరించినట్లు సమాచారం. మచిలీపట్నం శాసనసభ్యుడు పేర్ని నానికి నచ్చజెప్పాలని కిరణ్ కుమార్ రెడ్డి లగడపాటి రాజగోపాల్ ను కోరారు. ఆదివారంనాడు రెండు సార్లు లగడపాటికి ఆయన ఫోన్ చేశారు. పేర్ని నానితో చర్చలు జరిపి వైయస్ జగన్ వైపు వెళ్లకుండా చూడాలని ఆయన కోరినట్లు సమాచారం. అయితే, లగడపాటి రాజగోపాల్ అందుకు నిరాకరించారని తెలిసింది. కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ లో మాట్లాడిన తర్వాత లగడపాటి విజయవాడ నుంచి హైదరాబాదు వచ్చారు. అయితే, ఆయన కిరణ్ కుమార్ రెడ్డిని కలవకుండా తన పని మీద తాను వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. లగడపాటి రాజగోపాల్ అందుకు తిరస్కరించడంతో తానే రంగంలోకి దిగడం మంచిదని, పేర్ని నానికి నచ్చజెప్పాలని మంత్రి పార్థసారథిని నియోగించారు. ఆ తర్వాత మిగతా శాసనసభ్యులు చేజారకుండా కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభ్యులతో జిల్లాలవారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. విడివిడిగా కూడా కలుస్తున్నారు. మంత్రులను పురమాయిస్తున్నారు. మొత్తం మీద, లగడపాటి ఎపిసోడ్ కిరణ్ కుమార్ కు ఓ గుణపాఠం నేర్పినట్లే ఉంది.