స్వర్గీయ ఎన్టీ రామారావు కూతురు, కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ముఖ్యమంత్రి పదవి కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రకాశం జిల్లాలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రను అడ్డుకునేందుకు పురంధేశ్వరి కీలక పాత్ర వహించడానికి కారణం అదేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఓదార్పు యాత్ర విషయంలో తమ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మనోగతాన్ని పురంధేశ్వరి వెల్లడించడంపై జగన్ వర్గం భగ్గుమంటోంది. అధిష్టానం మెప్పు పొంది ముఖ్యమంత్రి పదవిని చేపట్టే ఉద్దేశంతోనే ఆమె అతి వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లా పార్టీ శాసనసభ్యులను ఢిల్లీకి పిలిపించి ఓదార్పు యాత్రకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయించడం, ఓదార్పు యాత్రలో వారు పాల్గొనకుండా కట్టడి చేయడం రాష్ట్ర రాజకీయాలపై పట్టు కోసమేనని అంటున్నారు. పురంధేశ్వరి భర్త, శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు కూడా ఈ విషయంలో కీలక పాత్ర పోషించారు. పురంధేశ్వరి ద్వారా జగన్ వల్ల జరిగే నష్టాన్ని పూడ్చుకునేందుకు అధిష్టానం భావిస్తోందని కూడా అంటున్నారు. పురంధేశ్వరికి నాయకత్వం అప్పగిస్తే తెలుగుదేశం పార్టీ వైపు ఉన్న కమ్మ సామాజిక వర్గం కాంగ్రెసు కాంగ్రెసుకు దగ్గరవుతుందని కూడా పార్టీ అధిష్టానం భావిస్తోందని అంటున్నారు. దీనివల్ల జగన్ వల్ల జరిగే నష్టాన్ని పూడ్చుకోవడానికే కాకుండా చంద్రబాబును బలహీన పరచుకోవచ్చునని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా పురంధేశ్వరికి సెప్టెంబర్ నెలలో పిసిసి పదవి కట్టబెడతారా అనేది కూడా చూడాల్సి ఉంది.