ముఖ్యమంత్రి కె. రోశయ్య భవిష్యత్తు కూడా దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియమిత్రుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు చేతుల్లో ఉందని అంటున్నారు. రోశయ్య కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన మంత్రులపై చర్యలు తీసుకోకపోవడం వెనక, కొత్తవారికి మంత్రి పదవులు ఇవ్వలేకపోవడం వెనక కెవిపి హస్తం ఉందని అంటున్నారు. కెవిపిని కాదని ఏమీ చేయలేని స్థితిలో రోశయ్య పడ్డారని ప్రచారం జరుగుతోంది. దీంతో రోశయ్యకు అనుకూలంగా ఉంటూ మంత్రి పదవులు వస్తాయని ఆశపడిన వారు భంగపడే పరిస్థితి వచ్చింది. శాసనసభ్యులు శంకరరావు, జెసి దివాకర్ రెడ్డి, టిజి వెంకటేష్ వంటి సీనియర్ శాసనసభ్యులు రోశయ్యకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. ఇటీవల శంకరరావు ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. కెవిపిని దూరంగా పెట్టాలని ఆయన రోశయ్యను కోరారు. అయితే, అది రోశయ్య వల్ల అయ్యే పని కాదని అంటున్నారు. కూకట్ పల్లి, మాదాపూర్ ప్రాంతాల్లో రోశయ్య కుమారుడు, అల్లుడు కొన్ని భూలావాదేవీలు చేశారని, ఇదంతా కెవిపికి తెలుసునని అంటున్నారు. ఆ లావాదేవీలను కెవిపి చూస్తున్నారట. దీంతో కెవిపి చేతిలో రోశయ్య ఇరుక్కున్నట్లు చెబుతున్నారు. జగన్ వర్గానికి, తనకు మధ్య మధ్యవర్తిగా వ్యవహరించే ఏకైక నాయకుడు కూడా కెవిపియేనని రోశయ్యకు తెలుసు. కెవిపిని దూరం చేసుకుంటే జగన్ వర్గంతో వైరం పెట్టుకోవాల్సిందేనని, అందుకు రోశయ్య సిద్దంగా లేరని చెబుతున్నారు. దీంతో కెవిపితో చేతులు కలిపి రోశయ్య రానున్న కాలాన్ని వెళ్లదీసే ఉద్దేశంతోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.