రాజకీయాలకు, కుటుంబ సంబంధాలకు మధ్య దూరం పాటించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. కుటుంబ సంబంధాలను కొనసాగించాలని ఆయన చేసిన ప్రయత్నాలను రాజకీయ ప్రయోజనాలకు తన సోదరుడి కుమారుడు వైయస్ జగన్ వాడుకుంటున్నారనే అభిప్రాయం ఆయనకు ఏర్పడినట్లు చెబుతున్నారు. కుటుంబ సంబంధాలను కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఆయన క్రిస్టమస్ పర్వదినాన వైయస్ జగన్ తో కేక్ కట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిందని, తాను కాంగ్రెసుకు దూరమవుతానని వార్తలు రావడంతో రాజకీయంగా అది తనకు మంచిది కాదని వైయస్ వివేకానంద రెడ్డి భావించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన వైయస్సార్ కుటుంబానికి దూరంగా ఉండాలనే నిర్ణయించుకున్నట్లు సమాచారం. కడప పార్లమెంటు నియోజకవర్గంలోనూ పులివెందుల శాసనసభా స్థానంలోనూ తన సత్తా చాటి వైయస్ జగన్ ను ఓడించాలనే లక్ష్యంతోనే పని చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జగన్ మామ గంగిరెడ్డి తీరు పట్ల ఆయన తీవ్రంగా కలత చెందినట్లు కూడా చెబుతున్నారు.