మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ బాటలో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి నడవాలని అనుకుంటున్నారు. కాంగ్రెసు పార్టీలో చేరినా తన సొంత వ్యవహారాలు, తన సొంత ఇమేజ్ పరిరక్షణ వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానేకొద్ది రోజుల్లోనే చిరంజీవి టీవీ ఛానల్ రాబోతోంది. దీనికి సంబంధించిన చర్చలు శుక్రవారం కూడా ఆయన నివాసంలో జరిగాయి. పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఒకరు, కిందటి ఎన్నికల్లో లోక్‌సభ అభ్యర్థిగా పోటీచేసిన మరొకరు ఈ ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. చిరంజీవికి ప్రాధాన్యమిచ్చేలా ఒక టీవీ ఛానల్ ఉండాలన్న ఆయన అభిమానులు, పార్టీ నేతల సూచన మేరకు కొద్దికాలంగా దీనిపై చిరంజీవి చర్చిస్తున్నారు. కాంగ్రెస్‌లో విలీనమైనా ఛానల్ ఉండటం మంచిదనే భావననే పార్టీ వర్గాలు వ్యక్తీకరిస్తున్నాయి. దీనికి అనుగుణంగా త్వరలో ఛానల్ రావచ్చని సమాచారం. కాంగ్రెసులోనే ఉంటూ జగన్ టీవీ చానెల్, పత్రిక నెలకొల్పారు. ఇప్పుడు ఆయనకు అవి ఇతోధికంగా తోడ్పడుతున్నాయి. అదే రీతిలో తనకంటూ ప్రత్యేక ప్రచారం మాధ్యమాలు ఉండాలని చిరంజీవి భావిస్తున్నారట.