హత్యకు గురైన మద్దెలచెర్వు సూరి భార్య గంగుల భానుమతి మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె మాటలను బట్టి ఆ విషయం అర్థమవుతోంది. వైయస్ జగన్ నుంచి తన గురించి ఏ విధమైన స్పందన వస్తుందో చూస్తానని ఆమె అన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి నుంచి తనకు మద్దతు ఉండేదని, ఇప్పుడు కాంగ్రెసు పార్టీ తనను పట్టించుకోవడం లేదని ఆమె బుధవారం సూరి అంత్యక్రియల అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను రాజకీయాల్లో ఉంటానని ఆమె కచ్చితంగా చెప్పారు. వైయస్ హయాంలో కూడా ఆమె కాంగ్రెసు నుంచి శాసనసభకు పోటీ చేయాలని అనుకున్నారు. అయితే ఆమెకు టికెట్ లభించలేదు. పరిటాల రవి జీవించి ఉన్న కాలంలోనే ధైర్యంగా తిరిగానని, ఇప్పుడు తనకు రాజకీయాల్లో తిరగడానికి భయపడాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. ఆ రోజుల్లోనే భద్రత లేకుండా తిరిగానని ఆమె అన్నారు. సూరి హత్యతో ఫాక్షన్ కక్షలు అంతమయ్యాయని, తాను ఫాక్షన్ ను ప్రోత్సహించబోనని ఆమె అన్నారు.