తెలంగాణలో కినోవా పండించొచ్చు: కేసీఆర్‌కు లేఖ
హైదరాబాద్: పాశ్చాత్య దేశాల్లో అధికంగా పండిస్తున్న కినోవా అనే పంట తెలంగాణలోను పండించవచ్చునని, ఇక్కడి వాతావరణం, పరిస్థితులకు ఇది తగిన పంట అని సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ) శాస్త్రవేత్తలు తేల్చారు.
అధిక పోషకాలతో కూడిన ఈ పంటకు తక్కువ నీరు ఉంటే చాలని, అన్ని విధాలా మేలు చేసే ఈ పంటను ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సీసీఎంబీ సంచాలకులు లేఖ రాశారు.

అమెరికా, పెరూ, జపాన్, ఆస్ట్రేలియా, చైనా, కెనడా, ఈక్వెడార్, బొలివియా తదితర దేశాల్లో ఈ పంటను అధికంగా పండిస్తారు. కినోవా ఓ రకం తృణధాన్యం. దీనిని రోజువారి ఆహారంగా, ఇతర పలు విధాలుగా వండుకొని తింటారు. భారత్‌లోను ఈ పంట అక్కడక్కడ పండిస్తున్నారు.
ఈ పంట తెలంగాణ రాష్ట్ర వాతావరణ పరిస్థితులకు అన్ని విధాలా అనుకూలమనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తక్కువ నీటితో దీనిని సాగు చేయవచ్చునని, అత్యధికంగా ప్రొటీన్లు, పీచు పదార్థాలు, ఖనిజాలు ఉన్నందున ఈ పంట సాగును ప్రోత్సహించాలన్నారు. తెలంగాణలో సాగునీరు తక్కువగా ఉన్నందున, తక్కువ నీటితో దీనిని పండించవచ్చునని చెప్పారు.












Click it and Unblock the Notifications