పురంధేశ్వరి: వైయస్ జగన్ పార్టీలోకా, బిజెపిలోకా?
హైదరాబాద్: తెలంగాణ బిల్లు ఆమోదం పొందితే కాంగ్రెసు పార్టీకి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించిన కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కోసం రెండు రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో పాటు బిజెపి కూడా ఆమె కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీవీ చానెళ్లలో విస్తృతంగా వార్తలు వచ్చాయి.
తమ పార్టీలోకి వస్తే విశాఖపట్నం లోకసభ స్థానం కేటాయిస్తామని బిజెపి పురంధేశ్వరికి హామీ ఇచ్చినట్లు సమాచారం. అలాగే, తమ పార్టీలోకి వస్తే విజయవాడ పార్లమెంటు సీటు ఇస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆమెకు వాగ్దానం చేసినట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల నేతలు కూడా దగ్గుబాటి దంపతులతో చర్చలు జరుపుతన్నట్లు వార్తలు వచ్చాయి.

పురంధేశ్వరి భర్త, కాంగ్రెసు శాసనసభ్యుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు పార్టీకి రాజీనామా చేసేందుకు ఎప్పుడో సిద్ధపడ్డారని అంటున్నారు. పురంధేశ్వరి తమ పార్టీలోకి వస్తే అదనంగా దగ్గుబాటి వెంకటేశ్వర రావు కలిసి వస్తారని బిజెపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు భావిస్తున్నాయి.
అయితే, దగ్గుబాటి దంపతులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో గానీ బిజెపితో గానీ చర్చలు జరపలేదని వారికి సన్నిహిత వర్గాలు వెల్లడించినట్లు ఓ ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ బుధవారం సాయంత్రం వార్తను ప్రసారం చేసింది.












Click it and Unblock the Notifications