అతివిశ్వాసం, వారి దూరమే జగన్‌ని ముంచిందా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అతి విశ్వాసమే సార్వత్రిక ఎన్నికలలో కొంపముంచిందా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెసు పార్టీ నుండి బయటకు జరిగిన పలు ఉప ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధించింది. నాడు వైయస్ రాజశేఖర రెడ్డి మృతి, ఎప్పుడు బయట అడుగు పెట్టని విజయమ్మ, షర్మిలలు బయటకు రావడం, జగన్ కోసమంటూ రాజీనామాలు చేయడం వంటి పలు సానుభూతి అంశాలు కలిసి వచ్చాయి.
నాటి తమ గెలుపు సానుభూతేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గుర్తించలేక.. ఆ గెలుపు బలుపేనని భావించి సార్వత్రిక ఎన్నికలలో చతికిల పడిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తమ ఓటమి పైన ఇప్పుడు పార్టీ అధ్యక్షులు, ఆ పార్టీ నాయకులు సమీక్షిస్తున్నారు.

తన ప్రచారంలో జగన్ పదేపదే టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకోవడం నష్టం చేసిందని అంటున్నారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉందని, అలాంటప్పుడు చంద్రబాబును అంటే లాభమేమిటని ప్రజలు ఆలోచించారని చెబుతున్నారు. అయితే, పదేళ్ల కాంగ్రెసు పాలనను జగన్ అనలేరని, ఎందుకంటే మొదటి ఐదున్నర సంవత్సరాల పాలన తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిదే కాబట్టి కిరణ్ పాలన పైన ఆయన నిప్పులు చెరిగారని అంటున్నారు.
అయితే కాంగ్రెసు పార్టీ కంటే చంద్రబాబునే ఎక్కువగా టార్గెట్ చేసుకోవడాన్ని ప్రజలు గుర్తించారని చెబుతున్నారు. ఉప ఎన్నికలు, తన ప్రచార సభలకు వస్తున్న ఆదరణ చూసిన జగన్, అధినేతకు సీమాంధ్రలో అంతులేని పలుకుబడి ఉందని ఆ పార్టీ నాయకులు అతి విశ్వాసానికి పోయి బోర్లా పడ్డారని చెబుతున్నారు.
ఉప ఎన్నికలలో తమ పార్టీ అనూహ్య గెలుపు నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు అతి విశ్వాసానికి పోయి పార్టీ బలోపేతంపై అంతగా దృష్టి పెట్టలేదని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు చాలామంది మొదటి నుండి సానుభూతి పైనే నమ్మకం పెట్టుకున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. మొదట వైయస్ మృతి, తర్వాత జగన్ కోసం రాజీనామాలు, ఆ తర్వాత జగన్ జైలుకు పోవడం వంటి సానుభూతి అంశాల పైనే ప్రధానంగా దృష్టి సారించారనే వారు లేకపోలేదు.
జగన్ తన ప్రచారంలో పదేపదే తన పైన కక్ష సాధింపు చర్యకు పాల్పడుతున్నారని చెప్పారు. నిత్యం అదే చెప్పడం ప్రజలకు విసుగు తెప్పించిందని అంటున్నారు. పలు సందర్భాలలో విజయమ్మ, జగన్, షర్మిలలు కొన్ని లుకలుకలు గుర్తించారని, వాటిపై దృష్టి పెట్టినప్పటికీ సఫలం కాలేదని చెబుతున్నారు.
రఘురామ కృష్ణంరాజు ఎపిసోడ్ జగన్ పార్టీ పైన బాగా పడిందని అంటున్నారు. ఆయన పార్టీ నుండి బయటకు వెళ్లడంతో క్షత్రియ సామాజిక వర్గం ఆయనకు దూరమైందని, అలాగే రఘురామ ఆరోపణలతో ఇతరులు కూడా దూరమయ్యారని అంటున్నారు. కొండా సురేఖ, మారెప్ప, రఘురామ, సబ్బం హరి వంటి జగన్ సన్నిహిత నేతలు వరుసగా దూరమవడం ఆ పార్టీని బాగా దెబ్బతీసిందని అంటున్నారు. కాపు కమ్యూనిటీకి జగన్ పార్టీ టిక్కెట్లు అధికంగా కేటాయించినప్పటికీ వారు కూడా సైకిల్ వైపే మొగ్గు చూపారంటున్నారు.












Click it and Unblock the Notifications