అన్నప్రాసన రోజేనా, గుడ్ న్యూస్ నెమ్మదిగా: కెటిఆర్
హైదరాబాద్: అన్నప్రాసన రోజే ఆవకాయ అన్న చందంగా తొందర వద్దని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం అన్నారు. బోయింగ్ గ్లోబల్ సమ్మిట‌్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
బోయింగ్, టాటా ఏరో సిస్టమ్స్ అడ్వాన్స్‌డ్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా తొలి ఏరో స్ట్రక్చర్ ఉత్పత్తి ప్లాంటును హైదరాబాదులో ఏర్పాటు చేయనున్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. కొందరు మీడియా ప్రతినిధులు ప్లాంట్‌కు శంకుస్థాపన ఎప్పుడు? ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమవుతుంది? అని ప్రశ్నించారు.
దానికి కెటిఆర్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. అన్నప్రాసన రోజే ఆవకాయ అన్న చందంగా తొందర వద్దని, ఇప్పుడే రెండు సంస్థలు ముందుకు వచ్చాయని, ప్లాంట్ కోసం ఎంతమేర ఖర్చు పెట్టాలి, ఎప్పుడు పనులు ప్రారంభించాలని చర్చించుకుంటున్నామని, త్వరలోనే ఈ వివరాలను ఆ కంపెనీలే వెల్లడిస్తాయన్నారు. మంచి వార్త విడతలవారిగా వింటే బాగుంటుందన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ... ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా హైదరాబాద్ నగరాన్ని ఏరోస్పేస్ హబ్‌గా మార్చుతామని మంత్రి కెటిఆర్ అన్నారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా త్వరలో అపాచ హెలికాప్టర్ల పరిశ్రమ రాబోతుందన్నారు.
ఏరో స్పేస్ హబ్‌గా హైదరాబాదును చేస్తామని, ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తామన్నారు. ఈ రంగంలో యువతకు శిక్షణ కోసం ప్రత్యేక అకాడమీ ఏర్పాటు చేస్తామన్నారు. అమెరికా ఫర్యటన ఫలితాన్ని ఇస్తోందన్నారు. హైదరాబాద్‌లో బీడీఎల్, డీఆర్‌డీఎల్‌వంటి ప్రముఖ రక్షణ, పరిశోధనా సంస్థలు ఉండటం ఏరోస్పేస్ హబ్‌కు అనుకూల అంశమన్నారు.












Click it and Unblock the Notifications